Nandamuri Balakrishna: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Meets UP CM Yogi Adityanath
  • లక్నోలో బాలకృష్ణ సందడి
  • సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మర్యాదపూర్వక భేటీ
  • అఖండ-2 ప్రమోషన్లతో బాలయ్య బిజీ
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. లక్నోలోని సీఎం ఆదిత్యనాథ్ నివాసంలో ఆదివారం ఈ భేటీ జరిగింది. ఇది మర్యాదపూర్వక సమావేశమే అయినప్పటికీ, తన రాబోయే చిత్రం 'అఖండ 2' ప్రమోషన్లలో భాగంగానే బాలకృష్ణ చిత్ర బృందంతో కలిసి ఆయన్ను కలిసినట్లు స్పష్టమవుతోంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2021లో సంచలన విజయం సాధించిన 'అఖండ'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న 3డీ, ఐమ్యాక్స్ ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనుండగా, ఆయన సరసన సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మరోసారి తన సంగీతంతో అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
Nandamuri Balakrishna
Yogi Adityanath
Akhanda 2
Uttar Pradesh
Boyapati Srinu
Samyuktha Menon
Adhi Pinisetty
SS Thaman
Tollywood
Telugu Cinema

More Telugu News