Anil Ravipudi: అనిల్ రావిపూడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi Gifts Expensive Watch to Anil Ravipudi
  • దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చిన చిరంజీవి
  • చిత్రం సెట్‌లో కేక్ కట్ చేసి అనిల్ రావిపూడి బర్త్‌డే వేడుకలు జరిపిన చిత్ర యూనిట్
  • ఈ చిత్రంలో నయనతార హీరోయిన్, కీలక అతిథి పాత్రలో వెంకటేశ్
  • 2026 సంక్రాంతికి 'మన శంకర వర ప్రసాద్ గారు' విడుదల
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ దర్శకుడు అనిల్ రావిపూడికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఆదివారం అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఆయనకు ఖరీదైన వాచ్‌ను బహూకరించారు. చిత్ర యూనిట్ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. మెగాస్టార్ నుంచి ఊహించని బహుమతి, ఆత్మీయ శుభాకాంక్షలు అందడంతో అనిల్ రావిపూడి భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "నా దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సెట్‌లో మీ ఉత్సాహం, మీ దర్శకత్వ శైలి ప్రతీ క్షణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. 2026 సంక్రాంతికి థియేటర్లలో మన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో పండగ వాతావరణాన్ని పంచుకోవడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను" అని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వెంకట్ మాస్టర్ నేతృత్వంలో ఈ యాక్షన్ సన్నివేశాలను చాలా స్టైలిష్‌గా, కొత్త పద్ధతిలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార మూడోసారి నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ ఒక కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి, వెంకటేశ్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Anil Ravipudi
Chiranjeevi
Mana Shankara Vara Prasad Garu
Nayanthara
Venkatesh
Telugu cinema
Tollywood
Sankranti 2026
Bheems Ceciroleo
Shine Screens

More Telugu News