Chandrababu Naidu: డబ్బు, పదవి ఉన్నా లభించని ప్రశాంతత పుట్టపర్తిలో దొరుకుతుందని ప్రముఖులు ఇక్కడికి వస్తారు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Says Puttaparthi Offers Peace That Money Cannot Buy
  • ప్రశాంతి నిలయానికి 75 ఏళ్లు పూర్తి
  • పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు
  • పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు
  • బాబా స్ఫూర్తితో సత్యసాయి ట్రస్ట్ సేవలు అమోఘం అన్న సీఎం
  • కోట్లాది రూపాయలతో తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక సంబరాలకు వేదికైంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలతో పాటు, ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం జరిగిన ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారు సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ సత్యసాయి బోధనలు, ఆయన స్ఫూర్తితో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.

సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచ సూత్రాలతో పాటు 'లవ్ ఆల్, సర్వ్ ఆల్.. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్' అనే సిద్ధాంతంతో సత్యసాయి బాబా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేశారని చంద్రబాబు అన్నారు. 86 ఏళ్ల తన జీవన ప్రయాణంలో విశ్వశాంతిని, సకల జనుల సంక్షేమాన్ని ఆకాంక్షించారని గుర్తుచేశారు. డబ్బు, పదవి ఉన్నా లభించని ప్రశాంతత పుట్టపర్తిలో దొరుకుతుందని, అందుకే దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఆయన మార్గాన్ని అనుసరించారని చెప్పారు. ప్రశాంతి నిలయం ఒక గొప్ప ఎనర్జీ సెంటర్ అని అభివర్ణించారు.

మానవ సేవే మాధవ సేవగా భావించి 1960లో సత్యసాయి సంస్థలను స్థాపించి సేవలకు రూపమిచ్చారని సీఎం వివరించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, తాగునీరు వంటి రంగాల్లో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. 102 పాఠశాలల ద్వారా 60 వేల మందికి ఉచిత విద్య, ఆసుపత్రుల ద్వారా రోజుకు 3 వేల మందికి ఉచిత వైద్యం అందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రూ.550 కోట్లతో 1600 గ్రామాలకు తాగునీరు అందించారని, ఒక్క చెన్నై నగరానికే రూ.250 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. నేడు 140 దేశాల్లో 2 వేల కేంద్రాలతో, 7.50 లక్షల మంది సేవా సభ్యులతో సత్యసాయి సంస్థలు విస్తరించడం గర్వకారణమని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సత్యసాయి బోధనలతో వసుధైక కుటుంబ భావనను నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు.
Chandrababu Naidu
Puttaparthi
Sathya Sai Baba
Prasanthi Nilayam
Sathya Sai Trust
Andhra Pradesh
бесплатное образование
бесплатное медицинское обслуживание
духовность
общественное обслуживание

More Telugu News