Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్.. ప్రశాంత్ కిశోర్ సంచలన ఆరోపణలు

Prashant Kishor Alleges Rigging in Bihar Elections
  • ఆధారాలు లేవు కానీ తన ఆరోపణలు మాత్రం నిజమేనన్న పీకే
  • ఎక్కడో ఏదో తప్పు జరిగిందని సందేహం వ్యక్తం చేసిన జన్ సురాజ్ పార్టీ చీఫ్
  • ఎన్నికల ముందు మహిళలకు రూ.10 వేలు పంచడంపై అధికార పార్టీపై ఫైర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) ఒక్క సీటు కూడా గెల్చుకోకపోవడంపై ఆ పార్టీ చీఫ్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా మరోమారు స్పందించారు. మొన్నటి ఎన్నికల్లో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని సందేహం వ్యక్తం చేశారు. పోలింగ్ కు ముందు తమ బృందం సేకరించిన ప్రజాభిప్రాయానికి, ఎన్నికల ఫలితాలకు అస్సలు సంబంధమే లేదని చెప్పారు. ప్రజాభిప్రాయానికి పూర్తి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. అయితే, ఈ విషయాన్ని నిరూపించేందుకు తనవద్ద సరైన ఆధారాలు లేవని కూడా ఆయన చెప్పారు. తన పార్టీ ఒక్క సీటును కూడా గెల్చుకోలేకపోవడం తనకు బాధ కలిగించిందని అన్నారు. ఈ ఓటమితో తన రాజకీయ జీవితం ముగిసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. వచ్చే ఐదేళ్లు బీహార్ లోనే ఉంటానని, ప్రజల్లోకి వెళతానని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. 

ఈవీఎంలను మార్చారని ఆరోపించాలంటూ తనను కొందరు కోరుతున్నారని ప్రశాంత్ కిశోర్ మీడియాకు తెలిపారు. అయితే, ఓటమి పాలైన తర్వాత ప్రతీ అభ్యర్థి చేసే ఆరోపణలు ఇవేనని అన్నారు. అదే సమయంలో ప్రజలకు అస్సలు పరిచయమే లేని పార్టీలకు కూడా లక్షలాది ఓట్లు పోలవడంపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనేందుకు ప్రస్తుతానికి తన వద్ద ఆధారాలు లేవని ఆయన వివరించారు.

అయితే, ప్రాథమికంగా ఏదో జరిగిందనేది మాత్రం స్పష్టమని, అదేంటనేదానికి ప్రస్తుతం తన వద్ద సమాధానం లేదన్నారు. క్షేత్రస్థాయిలో చాలా విషయాలు పొంతన కుదరడం లేదని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని మహిళలకు రూ.10 వేలు పంచడంపై ప్రశాంత్ కిశోర్ విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఆ పథకం తీసుకురాకుంటే ఎన్డీయే కూటమి ఘోరంగా ఓటమి పాలయ్యేదని పీకే అభిప్రాయపడ్డారు.
Prashant Kishor
Bihar Elections
Jan Suraaj Party
Election Rigging
EVM Machines
Bihar Politics
Assembly Elections
Political Strategist
NDA Alliance

More Telugu News