Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు... లొంగిపోయిన వారిలో కీలకనేత ఆజాద్

37 Maoists Surrender to Telangana DGP Shivadhar Reddy
  • లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు
  • మిగిలిన 34 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టులు
  • లొంగిపోయిన మావోయిస్టులు ఆయుధాలు అప్పగించినట్లు తెలిపిన డీజీపీ
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై ప్రభుత్వం రూ.1.41 కోట్ల రివార్డు ప్రకటించింది. లొంగిపోయిన వారికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేశ్, సోమ్‌దా అలియాస్ ఎర్ర ఉన్నారని తెలిపారు.

మిగిలిన 34 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని ఆయన వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను కూడా అప్పగించారని ఆయన అన్నారు.

37 మందికి తక్షణ సహాయంగా రూ.25 వేల చొప్పున అందజేశామని, ఆజాద్‌పై రూ.20 లక్షలు, అప్పాస్ నారాయణపై రూ.20 లక్షల రివార్డు ఉందని తెలిపారు. వీరితో పాటు లొంగిపోయిన మావోయిస్టులందరిపై రూ.1.41 కోట్ల రివార్డు ఉందని, ఆ మొత్తాన్ని వారికే అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే లొంగిపోయిన తెలంగాణ మావోయిస్టులకు ప్రభుత్వం అందించే పునరావాస ప్యాకేజీని అందజేస్తామని తెలిపారు.

మిగిలిన మావోయిస్టులు కూడా త్వరగా లొంగిపోవాలని ఆయన సూచించారు. తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీలో 10 మంది ఉన్నారని, వీరంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలని ఆయన అన్నారు.
Shivadhar Reddy
Telangana DGP
Maoists surrender
Telangana Maoists
Naxalites

More Telugu News