Harish Rao: రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని రూ.4,500 కోట్లకే విక్రయించాలని చూస్తున్నారు: హరీశ్ రావు

Harish Rao Slams Revanth Reddy Over Land Sale Allegations
  • రూ.4 లక్షల 95 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపణ
  • విక్రయానికి పెట్టిన భూమి 4,740 ఎకరాలు కాదని, 9,298 ఎకరాలు అన్న హరీశ్ రావు
  • పరిశ్రమలకు ఇచ్చిన భూములను బహుళ అవసరాలకు ఎలా వినియోగిస్తారని ప్రశ్న
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల విలువైన 9,298 ఎకరాల భూమిని రూ.4,500 కోట్లకు విక్రయించాలని చూస్తున్నారని, దీని ద్వారా రూ.4 లక్షల 95 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. విక్రయానికి పెట్టిన భూమి 4,740 ఎకరాలు మాత్రమేనని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారని, కానీ వాస్తవానికి ఆ భూమి 9,298 ఎకరాలుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రికి సవాల్ విసిరారు.

పారిశ్రామిక అవసరాల కోసం 50-60 ఏళ్ల కిందట కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఆజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు అధికంగా వసూలు చేయాలని చట్టం చేశామని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30 శాతానికే భూములను అప్పగించాలని చూస్తోందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5 లక్షల కోట్లు రావాల్సిన భూములకు రూ.5 వేల కోట్లు మాత్రమే ఎలా వస్తాయని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల బడ్జెట్‌కు సరిపడా నిధులు వచ్చే నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకోవడం సరికాదని అన్నారు. మంత్రి మండలి, అసెంబ్లీలో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. లక్షల కోట్ల విలువైన భూములను ఆగమేఘాల మీద ఎలా అప్పగిస్తారని నిలదీశారు.

ఈ భూములను వేలం వేస్తే రూ.5 లక్షల కోట్లు వస్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వ అవసరాలకు కూడా భూమి లేకుండా ఎలా విక్రయిస్తారని నిలదీశారు. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు పంపించాలని నిర్ణయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ ఇండస్ట్రీలను కూడా పంపిస్తోందని ఆరోపించారు. పరిశ్రమలకు ఇచ్చిన భూములను బహుళ అవసరాలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.
Harish Rao
Telangana land scam
Revanth Reddy
BRS
Congress government
Land auction

More Telugu News