Chandrababu Naidu: వైద్యుల నిర్లక్ష్యంపై సీఎం సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం

Chandrababu Naidu Orders Action on Medical Negligence in AP Govt Hospitals
  • కాకినాడ, రాజమండ్రి ఆసుపత్రుల్లో వైద్య నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం
  • కాకినాడలో ఇంజెక్షన్ వికటించి 8 నెలల గర్భిణి మృతి
  • రాజమండ్రిలో రోగికి గడువు ముగిసిన మందుల పంపిణీ
  • బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలకు చంద్రబాబు ఆదేశం
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని అధికారులకు హెచ్చరిక
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ, రాజమండ్రి ఆసుపత్రుల్లో జరిగిన ఈ ఘటనలపై ఆయన స్పందిస్తూ.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే, కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి చికిత్స పొందుతూ మరణించారు. ఆమెకు పాంటాప్రోజోల్ ఇంజెక్షన్ పడదని, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ఉన్నాయని కేస్ షీట్‌లో స్పష్టంగా ఉన్నప్పటికీ, పీజీ వైద్య విద్యార్థిని నవంబర్ 20న అదే ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో అస్వస్థతకు గురైన ఆమెకు ఫిట్స్ వచ్చి, గుండెపోటుతో అదే రోజు రాత్రి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణ లోపం కూడా ఈ ఘటనకు కారణంగా తేలింది.

అలాగే, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే వెలుగుచూసింది. అక్టోబర్ 2025తో గడువు ముగిసిన మందులను నవంబర్ 8న 55 ఏళ్ల రోగికి అక్కడి సిబ్బంది అందజేశారు. వాటిని వాడిన తర్వాత ఆ రోగి ఆరోగ్యం మరింత క్షీణించింది.

ఈ రెండు ఘటనలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి, సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాకినాడలో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి తక్షణమే సాయం అందించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Government Hospitals
Medical Negligence
Kakinada GGH
Rajahmundry Hospital
Patient Death
Expired Medicines
Healthcare System
Action Ordered

More Telugu News