British YouTuber: ఆఫ్ఘనిస్థాన్ లో బ్రిటన్ యూట్యూబర్ కు చేదు అనుభవం

Taliban Interrogation Forces YouTuber Joey Fraser to Flee Afghanistan
  • 5 రోజుల పర్యటనకు వెళ్లిన యూట్యూబర్ ఒక్కరోజులోనే వెనక్కి
  • కెమెరా, మైక్ కు అనుమతి లేదని అడ్డుకున్న తాలిబన్ అధికారులు
  • అడుగడుగునా ఆపి ప్రశ్నిస్తుండడంతో భయపడి తిరుగు ప్రయాణం
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పలు కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. మహిళలను విద్యకు దూరం చేయడంతో పాటు పలు ఆంక్షలు విధించారు. ఆఫ్ఘన్ లో ఏం జరుగుతోందనే దానిపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారంలో నిజానిజాలను ప్రపంచానికి వెల్లడించేందుకు బ్రిటన్ కు చెందిన యూట్యూబర్ జోయ్ ఫేజర్ ప్రయత్నించాడు. ఆఫ్ఘన్ లో పర్యటించి అక్కడి పరిస్థితులను తన ఫాలోవర్లకు చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తన కెమెరామెన్ తో పాటు ఆఫ్ఘన్ లో ఐదు రోజుల పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నాడు.

తాలిబన్ల రాజ్యం కావడంతో ఆఫ్ఘన్ పర్యటనపై తమకు మొదటి నుంచీ కాస్త ఆందోళనగానే ఉందని జోయ్ పేర్కొన్నారు. కాబూల్ లో ల్యాండయ్యాక ఇమిగ్రేషన్ అధికారుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాలో.. ఎంతసేపు ప్రశ్నిస్తారో అంటూ ఆందోళన చెందినట్లు తెలిపారు. అయితే, ఇందుకు భిన్నంగా ఇమిగ్రేషన్ అధికారి కేవలం ఒకే ఒక ప్రశ్న వేశారని, ఏం పనిమీద వచ్చారని అడిగారని చెప్పారు. దేశాన్ని చూడడానికి అని జవాబివ్వగానే ఎంట్రీ స్టాంప్ వేసి పాస్ పోర్ట్ తిరిగిచ్చారని వివరించారు. ఎయిర్ పోర్టులో, బయట కూడా స్థానికులు తమను చిరునవ్వుతో పలకరించారని, ఫోన్ చేసుకునేందుకు తమ ఫోన్ ను ఆఫర్ చేశారని జోయ్ చెప్పారు.

కాబూల్ లోని పర్యాటక ప్రదేశాలను చూపించేందుకు ముందే బుక్ చేసుకున్న గైడ్ తమను రిసీవ్ చేసుకున్నారని, హోటల్ కు తీసుకువెళ్లి తమ డ్రెస్సింగ్ స్టైల్ మార్చేశారని జోయ్ తెలిపారు. స్థానికులు వేసుకునే దుస్తులను ధరించాలని చెప్పడంతో తాము అలాగే రెడీ అయ్యామని వివరించారు. ఆపై స్థానికంగా ఉన్న ప్రదేశాలను చూడడానికి వెళ్లగా.. తాము వీడియో తీస్తున్న విషయం గమనించి తాలిబన్ భద్రతాధికారి ఒకరు తమను అడ్డుకున్నాడని జోయ్ చెప్పారు. తమ చేతిలోని మైక్, కెమరాలను చూపిస్తూ.. మీకు జర్నలిస్ట్ వీసా ఉందా? అని ప్రశ్నించాడని చెప్పారు. తాము లేదని జవాబివ్వడంతో తమ పాస్ పోర్ట్ తీసుకుని పక్కనే ఉన్న మిగతా భద్రతా సిబ్బంది వద్దకు వెళ్లి చర్చించాడని తెలిపారు.

దీంతో తమకు ఆందోళన మొదలైందని, ఆ సమయంలోనే తమ గైడ్ ఇటీవల జరిగిన షాకింగ్ సంఘటన గురించి చెప్పాడన్నారు. ఇటీవల ఇద్దరు యూట్యూబర్లను తాలిబన్ పోలీసులు జైలుకు పంపించారని, వారికి మూడ్నాలుగు నెలల జైలుశిక్ష పడుతుందని వివరించాడన్నారు. అక్కడ తనిఖీ పూర్తయ్యాక దగ్గర్లోని పార్కుకు వెళ్లగా అక్కడ మరో పోలీస్ అధికారి ఇలాగే ప్రశ్నించడంతో తాము తీవ్ర భయాందోళనలకు గురయ్యామని జోయ్ వివరించారు. 

తమకు జైలుకు వెళ్లే ఉద్దేశం లేకపోవడంతో తిరిగి వెళ్లిపోతామని తమ గైడ్ కు చెప్పగా అదే మంచి ఆలోచన, వెంటనే వెళ్లిపోండని గైడ్ బదులిచ్చాడన్నారు. దీంతో ఆఫ్ఘన్ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని కాబూల్ నుంచి బయటపడ్డామని జోయ్ చెప్పారు. ఈ పర్యటన మొత్తం ఇరవై నాలుగు గంటలు కూడా లేదని, అందులో కేవలం మూడు గంటలు మాత్రమే కాబూల్ లో కొన్ని వీడియోలు తీసుకున్నానని జోయ్ చెప్పారు.
British YouTuber
Afghanistan travel
Joey Fraser
Afghanistan
Taliban
YouTuber
Kabul
Travel
Taliban rule
Travel restrictions

More Telugu News