AP High Court: ప్రభుత్వ వైద్యుల తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

AP High Court Angered by Government Doctors Attitude
  • సదరం పరీక్షల్లో నిర్లక్ష్యం వహించడంపై ఫైర్
  • మానసిక వైకల్య పరీక్షలే చేసి శారీరక వైకల్యాన్ని విస్మరించడంపై అసహనం
  • యువతి వద్దకే నిపుణులను పంపి పరీక్షించాలని ఆరోగ్యశాఖకు ఆదేశం
ప్రభుత్వ సర్వీసులో చేరిన తర్వాత వైద్యుల్లో నిర్లిప్తత ఆవహిస్తోందని, అర్థంలేని నిబంధనలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రోగులకు సేవ చేయడానికే ఉన్నారనే విషయాన్ని వారు మరచిపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వికలాంగురాలికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
 
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు శేషగిరమ్మ, మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆమె మనవరాలు శ్యామల.. తమ 5 సెంట్ల భూమిని పొరపాటున సీఆర్‌డీఏకు ఇచ్చామని, దానిని తిరిగి ఇప్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా శ్యామలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు వైకల్య శాతాన్ని నిర్ధారించాలని గతంలో కోర్టు ఆదేశించింది.
 
దీంతో అధికారులు శ్యామలకు ‘సదరం’ పరీక్షలు నిర్వహించారు. ఈ నివేదికపై శుక్రవారం జరిగిన విచారణలో సదరం నోడల్ అధికారి డాక్టర్ సురేశ్ కోర్టుకు హాజరయ్యారు. శ్యామలకు 95 శాతం మానసిక వైకల్యం ఉన్నట్లు తేలిందని, అయితే శారీరక వైకల్యంపై తమ వద్ద వివరాలు లేవని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం మానసిక వైకల్య పరీక్షలు చేసి, శారీరక వైకల్యాన్ని విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషిని చూస్తేనే శారీరక స్థితిని అంచనా వేయవచ్చని, బహుళ వైకల్యం ఉన్న ఆమెను పరీక్షించాలని తాము చెప్పాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
 
వెంటనే నిపుణులైన వైద్య సిబ్బందిని శ్యామల వద్దకే పంపి, ఆమె శారీరక వైకల్యం ఎంత శాతం ఉందో తేల్చాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం విచారణను డిసెంబరు 1కి వాయిదా వేశారు. మరోవైపు, సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లకు ప్రత్యామ్నాయంగా 5 సెంట్ల స్థలం లేదా రూ.12 లక్షల పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు.
AP High Court
Andhra Pradesh High Court
Government Doctors
CRDA
Guntur
Tulluru
Seshamgiramma
Shyamala
Disability Certificate
SADAREM

More Telugu News