Karnataka Politics: పైకి మద్దతు.. లోలోపల అసంతృప్తి.. కర్ణాటకలో ఏం జరుగుతోంది?

DK Shivakumar responds to Siddaramaiah CM claim in Karnataka
  • ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానన్న సిద్దరామయ్య
  • అసంతృప్తితో ఢిల్లీకి పయనమైన డీకే శివకుమార్ వర్గం
  • అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్న ముఖ్యమంత్రి
  • సిద్దూకు మద్దతు అంటూనే డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఈరోజు బెంగళూరుకు రానున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని, మరో రెండేళ్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేది కూడా తానేనని సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఈ ప్రకటనతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయనకు మద్దతుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తమ వాదన వినిపించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సిద్దరామయ్య నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లిన నేతలకు ఆయన నేరుగా ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. అయితే, నాయకత్వ మార్పు లేదా కేబినెట్ విస్తరణపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని ఆయన మైసూరులో మీడియాతో అన్నారు. ఇవాళ‌ ఖర్గే బెంగళూరుకు వస్తున్నారని, ఆయన్ను స్వయంగా కలుస్తానని తెలిపారు. ఇదే సమయంలో సిద్దరామయ్యకు సన్నిహితుడైన మంత్రి సతీశ్‌ జార్కిహొళి తన నివాసంలో విందు సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఈ పరిణామాలపై డీకే శివకుమార్‌ ఆసక్తికరంగా స్పందించారు. తనకు గ్రూపు రాజకీయాలు తెలియవని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తనవాళ్లేనని అన్నారు. సిద్దరామయ్య ఐదేళ్లు సీఎంగా ఉంటాననడంలో తప్పేముందని, దానికి తమ మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, “ఎక్కడైతే కృషి ఉంటుందో.. అక్కడే ఫలాలు ఉంటాయి. ఎక్కడైతే భక్తి ఉంటుందో.. అక్కడే భగవంతుడు ఉంటాడు” అని ‘ఎక్స్’లో ఆయన చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. మొత్తం మీద ఖర్గే పర్యటన తర్వాతే ఈ వివాదానికి ఒక ముగింపు లభించే అవకాశం ఉంది.
Karnataka Politics
Siddaramaiah
DK Shivakumar
Karnataka Congress
Mallikarjun Kharge
AICC
Karnataka CM
Congress party infighting
Satish Jarkiholi

More Telugu News