Nara Bhuvaneswari: మహిళా కార్యకర్త ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేసిన నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!

Nara Bhuvaneswari Surprise Visit to TDP Worker Home in Kuppam
  • కుప్పం పర్యటనలో కార్యకర్త ఇంటికి నారా భువనేశ్వరి
  • ఇంటికి రావాలని ఆహ్వానించిన మహిళకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
  • శాంతిపురం మండలం చెల్దిగానిపల్లిలో లక్ష్మమ్మ ఇంటికి ఆకస్మిక పర్యటన
  • కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా
  • భువనేశ్వరి రాకతో కార్యకర్త కుటుంబంలో ఆనందోత్సాహాలు
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి, ఓ సాధారణ కార్యకర్త ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను సర్ ప్రైజ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వారి ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 

నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. తొలిరోజు శాంతిపురం మండలం చెల్దిగానిపల్లిలో పర్యటిస్తున్న సమయంలో లక్ష్మమ్మ అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ, తమ ఇంటికి భోజనానికి రావాలని భువనేశ్వరిని ఆప్యాయంగా ఆహ్వానించారు. దీనికి స్పందించిన భువనేశ్వరి, తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.

చెప్పిన మాట ప్రకారం, ఆమె శుక్రవారం ఉదయం నేరుగా లక్ష్మమ్మ ఇంటికి వెళ్లారు. అనుకోని ఈ పరిణామంతో లక్ష్మమ్మ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అభిమాన నేత బాబన్న (చంద్రబాబు) అర్ధాంగి తమ ఇంటికి రావడంతో వారు సంతోషంతో ఉప్పొంగిపోయారు. భువనేశ్వరికి సాదర స్వాగతం పలికి, ప్రేమతో చీరను బహుమతిగా అందించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అనంతరం వారి ఇంట్లో అల్పాహారం చేసి, అక్కడి నుంచి శాంతిపురంలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. 
Nara Bhuvaneswari
Kuppam
Chandrababu Naidu
Lakshmamma
TDP
Andhra Pradesh Politics
BC Community
Welfare Schemes
Surprise Visit

More Telugu News