Chandrababu Naidu: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మరింత క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Clarifies PPP Medical College Policy in Andhra Pradesh
  • ఏపీ వైద్య రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు
  • పీపీపీ విధానంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలలు ప్రభుత్వ నియంత్రణలోనే!
  • గ్రామీణ పేదలకు ఉచిత వైద్యమే లక్ష్యం... చంద్రబాబు స్పష్టీకరణ
  • కుప్పంలో 'సంజీవని' ప్రాజెక్టు.. ఆరోగ్య రంగంలో గేమ్ ఛేంజర్ అన్న సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తున్న వైద్య కళాశాలలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోనే, ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనసాగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కళాశాలల ఏర్పాటు విద్యార్థులు, ప్రజల ప్రయోజనాల కోసమేనని, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తేల్చిచెప్పారు.

శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు.. వైద్య, ఆరోగ్య సేవలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య కళాశాలల అభివృద్ధి, యూనివర్సల్ హెల్త్ స్కీమ్, కుప్పంలో తలపెట్టిన 'సంజీవని' ఆరోగ్య ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై ఆయన చర్చించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. టెండర్ల ప్రక్రియ వచ్చే నెల నాటికి పూర్తవుతుందని అధికారులు తెలపగా, పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కళాశాలల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.

ప్రతి వైద్య కళాశాలకు 50 ఎకరాల భూమి కేటాయించామని, అందులో 25 ఎకరాల్లో మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని సీఎం వివరించారు. మిగిలిన 25 ఎకరాల్లో పారామెడికల్, నర్సింగ్, డెంటల్ కేర్, వెల్‌నెస్ సెంటర్లు, ఆయుర్వేద, యోగా కేంద్రాలు వంటి అనుబంధ సేవలను అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. ఈ కళాశాలలు, ఆసుపత్రులు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, నీతి ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

కుప్పంలో 'సంజీవని'.. వైద్య రంగంలో గేమ్‌ ఛేంజర్‌

కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న 'సంజీవని' ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ ప్రాజెక్టులోని 'డిజినెర్వ్ సెంటర్' ప్రజారోగ్య రంగంలో ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డులను డిజిటలైజేషన్ చేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పటికే కుప్పంలో 49,000 మంది ఆరోగ్య సమాచారాన్ని సేకరించామని, 2026 జనవరి 1 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును విస్తరిస్తామని వెల్లడించారు. టాటా, బిల్ గేట్స్ ఫౌండేషన్ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

నివారణ చర్యలపై దృష్టి సారించాలి

2026 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ ద్వారా నెలకు రూ. 330 కోట్లు ఖర్చు చేస్తూ 12 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రజారోగ్యం విషయంలో నివారణ (ప్రివెంటివ్), నివారణానంతర (క్యూరేటివ్) పద్ధతులపై దృష్టి సారించాలని, తద్వారా వైద్య రంగంపై భారాన్ని తగ్గించవచ్చని సీఎం సూచించారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా సేకరించిన ఆరోగ్య డేటాను విశ్లేషించి, తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Medical Colleges
PPP Model
Public Private Partnership
Healthcare
Sanjeevani Project
Kuppam
Universal Health Insurance
Health Schemes

More Telugu News