మిస్ యూనివర్స్ 2025.. నిరాశపరిచిన భారత సుందరి
- మిస్ యూనివర్స్ 2025 రేసు నుంచి భారత్ నిష్క్రమణ
- టాప్ 30లో చోటు దక్కించుకున్న మానిక విశ్వకర్మ
- టాప్ 12కు అర్హత సాధించలేకపోయిన భారత సుందరి
- స్విమ్‌సూట్ రౌండ్‌లో వెనుదిరగడంతో తప్పిన అవకాశం
- 2026 మిస్ యూనివర్స్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న ప్యూర్టోరికో
ఫైనల్స్‌లో భాగంగా జరిగిన స్విమ్‌సూట్ రౌండ్‌లో మానిక ప్రదర్శన న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తెల్లటి మోనోకినీలో కనిపించిన ఆమె, ఈ రౌండ్‌లో తగినంతగా రాణించలేకపోవడంతో పోటీ నుంచి నిష్క్రమించింది. చైనా, కొలంబియా, థాయ్‌లాండ్, అమెరికా, మెక్సికో వంటి దేశాలతో పాటు మానిక టాప్ 30లో నిలిచినప్పటికీ, తదుపరి దశకు చేరుకోలేకపోయింది.
ప్రస్తుతం గ్వాడెలోప్, కొలంబియా, క్యూబా, మెక్సికో, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, చైనా, వెనిజులా సహా 12 దేశాల సుందరీమణులు తర్వాతి రౌండ్ అయిన ఈవినింగ్ గౌన్ రౌండ్‌లో పోటీ పడుతున్నారు. మరోవైపు ఇదే వేదికపై 2026లో జరగబోయే 75వ మిస్ యూనివర్స్ పోటీలకు ప్యూర్టోరికో ఆతిథ్యం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే మిస్ యూనివర్స్ 2025 విజేత ఎవరో తేలిపోనుంది.