YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డిని 12 గంటల పాటు విచారించిన సిట్.. అంతా అధికారులే చేశారన్న సుబ్బారెడ్డి

YV Subba Reddy Questioned for 12 Hours by SIT in Ghee Adulteration Case
  • తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి విచారణ
  • మాజీ పీఏ చిన్నప్ప వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నల వర్షం
  • టెండర్ల నిబంధనల సవరణపై సిట్ ప్రధానంగా ఆరా
  • తనకు సంబంధం లేదని, అధికారులదే బాధ్యతని చెప్పిన సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డిని నిన్న సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు దాదాపు 12 గంటల పాటు సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.

సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చిన్నప్ప ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ ఈ విచారణ చేపట్టింది. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు మైసూరు ల్యాబ్ నివేదిక నిర్ధారించినా, కొన్ని కంపెనీలకు కాంట్రాక్టులు ఎందుకు కొనసాగించారని అధికారులు ప్రశ్నించారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీలకు 2024 వరకు, భోలే బాబా డైరీకి 2022 వరకు సరఫరా అనుమతులు ఎందుకు రద్దు చేయలేదని ఆరా తీశారు. టెండర్లలో పాల్గొనేందుకు అనుభవం లేని సంస్థలకు అనుకూలంగా నిబంధనలను ఎందుకు సవరించారని నిలదీశారు.

ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్నప్ప... నెయ్యి సరఫరాదారుల నుంచి కిలోకు రూ.25 చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ అంశాన్ని ప్రస్తావించగా, తనకు ఏమీ గుర్తులేదని సుబ్బారెడ్డి సమాధానమిచ్చినట్లు సమాచారం. చిన్నప్ప బ్యాంకు ఖాతాలో 2019-24 మధ్య రూ.4.69 కోట్లు జమ కావడంపై అడిగిన ప్రశ్నలకు కూడా తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

టెండర్లు, నిబంధనల ఖరారు వంటివన్నీ అప్పటి అధికారులే చూసుకున్నారని, వాటిలో తన ప్రమేయం లేదని సుబ్బారెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది. సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, అవసరమైతే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డిని కూడా సిట్ విచారించిన విషయం తెలిసిందే.
YV Subba Reddy
TTD
Tirumala
laddu
ghee adulteration
AV Dharma Reddy
Chinnappa
Special Investigation Team
Tenders
YSRCP

More Telugu News