Kollu Ravindra: హైదరాబాద్‌లో జగన్ తీరు న్యాయవ్యవస్థను హేళన చేసేలా ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra Slams Jagan for Court Drama in Financial Crimes Case
  • అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన జగన్
  • జగన్ కోర్టుకు హాజరవుతూ బలప్రదర్శన చేశారన్న కొల్లు రవీంద్ర
  • జగన్ వంటి ఆర్థిక నేరస్థుడి వెనుక నడిచే వారు ఆలోచించాలని సూచన
వైఎస్ జగన్ ఈరోజు హైదరాబాద్‌లో వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థను హేళన చేసేలా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఇప్పటి వరకు కోర్టులకు హాజరుకాకుండా ఆయన డ్రామాలు ఆడారని విమర్శించారు. అక్రమాస్తుల కేసులో జగన్ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన తీరును మంత్రి తీవ్రంగా విమర్శించారు. ఇన్నాళ్లు కోర్టులకు హాజరు కాలేదని గుర్తు చేశారు. 11 సీబీఐ ఛార్జీషీట్లు, 9 ఈడీ ఛార్జీషీట్లలో జగన్ రెడ్డి ఏ1గా ఉన్నారని గుర్తు చేశారు.

సుమారు రూ.43 వేల కోట్ల అవినీతిని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు కోర్టుకు హాజరవుతూ బలప్రదర్శన చేయడం సిగ్గుచేటని అన్నారు. భారీ ఊరేగింపులు, ర్యాలీలతో కోర్టుకు ఎవరైనా హాజరవుతారా? అని ప్రశ్నించారు. అలా చేయడం న్యాయస్థానాలను అవమానించిడమేనని అన్నారు. 'రఫ్పా రఫ్పా' అంటూ బ్యానర్లతో ర్యాలీ తీయడం జగన్ నేర మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

జగన్ వంటి ఆర్థిక నేరస్థుడి వెనుక నడిచేవారు ఇప్పటికైనా ఆలోచించాలని సూచించారు. క్విడ్ ప్రో కో, షెల్ కంపెనీలతో ప్రజల ఆస్తులను జగన్ కొల్లగొట్టారని ఆరోపించారు. తప్పు చేసినవారు ఎప్పటికీ చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
Kollu Ravindra
YS Jagan
Andhra Pradesh
Corruption Case
CBI Court
ED Chargesheet

More Telugu News