DK Shivakumar: కర్ణాటకలో మళ్లీ తెరపైకి ముఖ్యమంత్రి మార్పు అంశం... ఢిల్లీకి డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు

DK Shivakumar Faction MLAs Travel to Delhi Over Karnataka Chief Minister Change
  • ఢిల్లీకి వెళ్లిన పలువురు డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు
  • రేపు ఢిల్లీకి వెళ్లనున్న మరికొందరు ఎమ్మెల్యేలు
  • డీకే శివకుమార్‌ను సీఎంగా చేయాలంటూ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు దాటిన నేపథ్యంలో డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఈరోజు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. రెండున్నర సంవత్సరాలు పూర్తయినందున సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌కు అవకాశమివ్వాలని ఆయన వర్గం కోరుకుంటోంది. అయితే, పార్టీలో ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని సిద్ధరామయ్య, శివకుమార్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు.

తాజాగా, డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మార్పు అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు యోచిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇచ్చిన హామీ ప్రకారం డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానాన్ని కోరనున్నారని సమాచారం.

ఈ మేరకు ఎమ్మెల్యేలు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తమ డిమాండ్‌ను ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రేపు ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్‌ను కూడా కలుస్తారని సమాచారం.

ఢిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలలో దినేశ్ గూలిగౌడ, రవి గణిగ, గుబ్బి వాసు ఉండగా, అనేకల్ శివన్న, నేలమంగళ శ్రీనివాస్, ఇక్బాల్ హుస్సేన్, కునిగల్ రంగనాథ్, శివగంగ బసవరాజు, బాలకృష్ణ తదితరులు రేపు ఉదయం చేరుకోనున్నారని సమాచారం.

"నేను ఢిల్లీకి వెళ్లి బంగారం, వజ్రాలు ఏమైనా అడుగుతానా ఏమిటి? మా నాయకుడు డీకే శివకుమార్ కోసమే దేశ రాజధానికి వెళుతున్నాన"ని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ జాతీయ మీడియాతో అన్నారు. అంతకుముందు, డీకే సోదరుడు సురేశ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మాటను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు.
DK Shivakumar
Karnataka
Chief Minister
Siddaramaiah
Congress
AICC
Mallikarjun Kharge

More Telugu News