Elon Musk: చేయడానికి పనులు ఉండవు, డబ్బుకు విలువ పోతుంది: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Elon Musk AI Remarks on Future of Jobs and Money
  • భవిష్యత్తులో ఉద్యోగాలు ఆప్షనల్ అవుతాయన్న ఎలాన్ మస్క్
  • ఏఐ, రోబోల వల్ల డబ్బుకు కూడా విలువ ఉండదని కీలక వ్యాఖ్యలు
  • పేదరికాన్ని ఏఐ, హ్యుమనాయిడ్ రోబోలు పూర్తిగా రూపుమాపుతాయని జోస్యం
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ, హ్యుమనాయిడ్ రోబోల విస్తృతితో భవిష్యత్తులో ఉద్యోగాలు చేయడం అనేది కేవలం ఒక ఐచ్ఛికం (ఆప్షనల్)గా మారుతుందని, డబ్బుకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఉండదని జోస్యం చెప్పారు. వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా పాల్గొన్నారు.

రాబోయే పది, ఇరవై ఏళ్లలో మనుషులు చేయడానికి పనులేమీ ఉండవని మస్క్ అన్నారు. "భవిష్యత్తులో చాలా పనులు ఆప్షనల్‌గా మారతాయి. ఇప్పుడు మనం క్రీడలు లేదా వీడియో గేమ్స్‌ను ఎలా ఆడుతున్నామో, రేపు ఉద్యోగం కూడా అలాగే ఉంటుంది. అవసరం కోసం కాకుండా కేవలం అభిరుచిని బట్టి పనులు చేసే రోజులు రానున్నాయి" అని మస్క్ వివరించారు.

ఏఐ, రోబోటిక్స్ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తాయని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పేదరికం ఒక సామాజిక సమస్య కాదని, అదొక ఇంజినీరింగ్ సమస్య అని అభివర్ణించారు. "ఏఐ, రోబోటిక్స్ ప్రాథమిక వస్తువులు, సేవల ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. తద్వారా పేదరికం అంతమవుతుంది. ఏఐ, హ్యుమనాయిడ్ రోబోలు అందరినీ ధనవంతులుగా మారుస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. హ్యుమనాయిడ్ రోబోల తయారీలో టెస్లా అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే వేదికపై ఉన్న ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ మాట్లాడుతూ.. ఏఐ వల్ల ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని అంగీకరించారు.
Elon Musk
Artificial Intelligence
AI
robotics
future of work
Jensen Huang
Tesla
humanoid robots
US-Saudi Investment Forum
poverty eradication

More Telugu News