Ramakrishna Dubey: డెలివరీ బాయ్ డబుల్ గేమ్.. భార్యలిద్దరూ కలిసి జైలుకు పంపించారు!

Ramakrishna Dubey Delivery Boy Arrested for Double Marriage in Uttar Pradesh
  • ఒకే నెలలో ప్రియురాలిని, పెద్దలు కుదిర్చిన యువతిని పెళ్లాడిన వ్యక్తి
  • ఏడాది పాటు ఇద్దరు భార్యలతో వేర్వేరుగా కాపురం
  • అనుకోని ఫోన్ కాల్‌తో బయటపడిన బహుభార్యత్వ వ్యవహారం
ఒకే నెలలో ఇద్దరు మహిళలను వివాహం చేసుకుని, ఏడాది పాటు రహస్యంగా కాపురం చేసిన ఓ వ్యక్తి బండారం చివరకు బట్టబయలైంది. ఇద్దరు భార్యలు ఏకమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, స్థానిక డెలివరీ కంపెనీలో పనిచేసే రామకృష్ణ దూబే అలియాస్ రాహుల్, 2024 నవంబర్‌లో తన ప్రియురాలు ఖుష్బూను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సరిగ్గా నెల రోజులు తిరిగేలోపే, కుటుంబ సభ్యులు కుదిర్చిన శివంగి అనే మరో యువతిని పెళ్లాడాడు. డెలివరీ బాయ్ ఉద్యోగం కావడంతో ఎక్కువ సమయం బయటే ఉంటూ, ఇద్దరు భార్యలకు అనుమానం రాకుండా ఏడాది పాటు రెండు కాపురాలను నెట్టుకొచ్చాడు. ఈ క్రమంలో మొదటి భార్య ఖుష్బూకు ఒక ఆడబిడ్డ కూడా జన్మించింది.

అయితే, ఒకే ఒక్క ఫోన్ కాల్ అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఒకరోజు ఖుష్బూ తన భర్తకు ఫోన్ చేయగా, అనుకోకుండా రెండో భార్య శివంగి ఆ ఫోన్‌ను లిఫ్ట్ చేసింది. తాను రామకృష్ణ భార్యనని ఖుష్బూ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఖుష్బూ తన పెళ్లి ఫొటోలను శివంగికి పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ మోసం తెలియగానే ఇద్దరు భార్యలు ఒకటై స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తమను పెళ్లి పేరుతో రామకృష్ణ మోసం చేశాడని, అందుకు సంబంధించిన ఫొటోలు, ఆధారాలను పోలీసులకు సమర్పించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు బహుభార్యత్వం కింద కేసు నమోదు చేసి రామకృష్ణను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Ramakrishna Dubey
Delivery boy
Uttar Pradesh
Prayagraj
Bigamy
Khushboo
Shivangi
Marriage fraud
Crime news

More Telugu News