Donald Trump: అణుయుద్ధం జరగకుండా అడ్డుకున్నా.. భారత్-పాక్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Trump says threatened 350 percent tariffs to prevent India Pakistan war
  • భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానన్న ట్రంప్
  • 350 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించడంతోనే ఇది సాధ్యమైందని వ్యాఖ్య
  • యుద్ధానికి వెళ్లడం లేదని ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి చెప్పారన్న ట్రంప్
  • మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని మొదటి నుంచి ఖండిస్తున్న భారత్
  • ఈ ఏడాది మే నుంచి 60 సార్లకు పైగా ఇదే విషయాన్ని చెప్పిన ట్రంప్
అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా తానే అడ్డుకున్నానని, 350 శాతం భారీ సుంకాలు విధిస్తానని బెదిరించడంతోనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. యుద్ధానికి వెళ్లడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.

సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హాజరైన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడారు. "వివాదాలను పరిష్కరించడంలో నేను నిపుణుడిని. భారత్, పాకిస్థాన్ అణ్వాయుధాలతో యుద్ధానికి సిద్ధమయ్యాయి. మీరు యుద్ధం చేసుకోవచ్చు, కానీ రెండు దేశాలపై 350 శాతం సుంకాలు విధిస్తానని చెప్పాను. అణు ధూళి లాస్ ఏంజిల్స్‌పై తేలియాడటాన్ని నేను చూడలేను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా తనకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారని ట్రంప్ చెప్పారు. ఈ ఏడాది మే నెల నుంచి ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది 60 సార్లకుపైనే. అయితే, ఈ విషయంలో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని భారత్ మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది.

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా, పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ మే 7న 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఆ తర్వాత మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితంగానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. ఇందులో మరెవరి ప్రమేయం లేదని తేల్చిచెప్పింది.
Donald Trump
India Pakistan relations
Nuclear war
Narendra Modi
Shehbaz Sharif
US Saudi Investment Forum
Tariffs
Operation Sindoor
Ceasefire agreement
DGMO

More Telugu News