Bank Manager Honeytrap: బ్యాంకు మేనేజర్ కు హనీట్రాప్.. సొంత తల్లినే ఎరగా వేసిన ప్రబుద్ధుడు

Bank Manager Honeytrap Case in Karnataka Mother and Son Blackmail
  • ఏకాంతంగా గడిపిన సమయంలో సెల్ ఫోన్ తో రికార్డ్ చేసి బెదిరింపులు
  • 10 లక్షలు ఇవ్వాలని బ్యాంక్ మేనేజర్ కు ఫోన్
  • పోలీసులను ఆశ్రయించడంతో బయటపడ్డ తల్లీకొడుకుల నిర్వాకం
ఈజీ మనీ కోసం ఓ ప్రబుద్ధుడు తల్లినే ఎరగా వేశాడు. ఓ బ్యాంకు మేనేజర్ ను హనీట్రాప్ లో ఇరికించి, లక్షలు వసూలు చేయాలని ప్లాన్ వేశాడు. తన తల్లితో ఆ మేనేజర్ ఏకాంతంగా గడిపినపుడు సెల్ ఫోన్ తో రికార్డు చేసి బెదిరింపులకు దిగాడు. అయితే, బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో తల్లీకొడుకుల నిర్వాకం బయటపడింది. కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండి పట్టణంలో చోటుచేసుకుందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

ఇండి పట్టణంలోని ఒక బ్యాంకు మేనేజరుకు కొంతకాలం క్రితం కొబ్బరి బొండాలు అమ్మే మహిళ (44)తో పరిచయమైంది. బ్యాంకు పక్కనే కొబ్బరి బొండాలు అమ్ముతుండడంతో సదరు మహిళతో మాటామాటా పెరిగింది. ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని మేనేజర్ ను హనీట్రాప్ లో ఇరికించేందుకు ఆ మహిళ కొడుకు (24) కుట్ర చేశాడు. ఇందుకు తల్లి కూడా సహకరించడం గమనార్హం.

తల్లీకొడుకుల పథకం ప్రకారం ఈ నెల 1న ఆ మహిళ బ్యాంక్ మేనేజర్ ను తన ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లో తాను మాత్రమే ఉంటానని, సరదాగా గడుపుదామని పిలిచింది. ఇంటికి వచ్చిన మేనేజర్ తో ఆమె సన్నిహితంగా ఉన్న సమయంలో కిటికీలో సెల్ ఫోన్ పెట్టి వీడియో తీసింది. ఆ ఫోన్ ను గమనించిన మేనేజర్ ప్రశ్నించగా.. ఆ ఫోన్ పాడైపోయిందని జవాబిచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకు మేనేజర్ కు ఫోన్ చేసి తామిద్దరూ ఏకాంతంగా గడిపిన సంఘటనను గుర్తుతెలియని వ్యక్తులు రికార్డు చేశారని, ఆ వీడియో పంపించి బెదిరిస్తున్నారని నాటకమాడింది. వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించింది.

ఆ మహిళ కొడుకు, అల్లుడు, ఓ పత్రిక విలేకరి.. ముగ్గురూ కలిసి బ్యాంకు మేనేజర్ కు ఫోన్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. అడిగిన సొమ్ము వెంటనే ఇవ్వకుంటే ఆయన రాసలీలల వీడియోను టీవీలో ప్రసారం చేస్తామని బెదిరించారు. దీంతో కంగుతిన్న బ్యాంకు మేనేజర్.. పోలీసులను ఆశ్రయించాడు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. మొబైల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు జరిపి కొబ్బరి బొండాలు అమ్మే మహిళ కొడుకును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తల్లితో కలిసి తాను చేసిన కుట్రను నిందితుడు వెల్లడించాడు. ప్రస్తుతం తల్లి, మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ తల్లీకొడుకులు గతంలో కూడా ఇదే తరహాలో పలువురిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
Bank Manager Honeytrap
Honeytrap
Bank manager
Karnataka
Extortion
Crime
Blackmail
Vijayapura
Police Investigation

More Telugu News