ETV Win: పైరసీపై కొత్త పోరు.. రూ.99కే సినిమా టికెట్ ప్రకటించిన ఈటీవీ విన్!

ETV Win Announces Movie Ticket at Rs 99 to Fight Piracy
  • పైరసీని అరికట్టేందుకు ఈటీవీ విన్ కీలక నిర్ణయం
  • 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా టికెట్ ధర రూ.99కి తగ్గింపు
  • ప్రేక్షకుల అభిప్రాయం మేరకే ధరలు తగ్గించినట్లు వెల్లడి
పైరసీపై పోరాటంలో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ ఒక కీలక ముందడుగు వేసింది. తమ సంస్థ నిర్మించిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా టికెట్‌ ధరను కేవలం రూ.99గా నిర్ణయించినట్లు ప్రకటించింది. సింగిల్‌ థియేటర్లలో ఈ ధర వర్తిస్తుండగా, మల్టీప్లెక్స్‌ థియేటర్లలో రూ.105గా ఉంటుందని తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, పైరసీని అరికట్టవచ్చని సంస్థ భావిస్తోంది.
 
బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ప్రీ-రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ఈటీవీ విన్‌ బిజినెస్‌ హెడ్‌ సాయికృష్ణ మాట్లాడుతూ, "ఇటీవల ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత, సినిమా టికెట్‌, పాప్‌కార్న్‌ ధరలు తగ్గితే థియేటర్లకు వస్తామని చాలా మంది అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాన్ని గౌరవించే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం" అని వివరించారు. రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు.
 
గతంలో తమ సంస్థ నుంచి వచ్చిన ‘క’ సినిమాను పైరసీ కాకుండా విజయవంతంగా అడ్డుకున్నామని సాయికృష్ణ గుర్తుచేశారు. "పైరసీ మన నుంచే మొదలైంది, దాన్ని ఆపే బాధ్యత కూడా మనదే. ప్రతి ఒక్కరూ థియేటర్లలో సినిమా చూసి సహకరించాలి" అని ఆయన ప్రేక్షకులను కోరారు.
 
అఖిల్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ హీరో కిరణ్‌ అబ్బవరం హాజరు కాగా, చిత్రబృందం మొత్తం పాల్గొంది.
ETV Win
Raju Weds Rambha
Sai Krishna
Ibomma Ravi
Movie Piracy
Telugu Cinema
Akhil
Tejaswini
Sailu Kampati
Kiran Abbavaram

More Telugu News