Shubman Gill: టీమిండియాకు ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరం

Shubman Gill Ruled Out of Second Test Due to Injury
  • మెడ గాయం కారణంగా కీలక మ్యాచ్‌కు గైర్హాజరు
  • గిల్ స్థానంలో తుది జట్టులోకి రానున్న సాయి సుదర్శన్
  • కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో గాయపడ్డ గిల్
  • పూర్తిగా కోలుకోవడానికి కనీసం 10 రోజులు పట్టే అవకాశం
దక్షిణాఫ్రికాతో సిరీస్ సమం చేయాలనే లక్ష్యంతో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా గువాహటిలో జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు తుది జట్టులో అవకాశం లభించనుంది. ఈ మేరకు ఎన్డీటీవీ తన కథనంలో వెల్లడించింది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. 124 పరుగుల లక్ష్య ఛేదనలో గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించగా, భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్‌ను నిర్ణయించే రెండో టెస్టు రేప‌టి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాగైనా ఆడాలనే పట్టుదలతో గిల్ జట్టుతో పాటు గువాహటి ప్రయాణమయ్యాడు. అయినప్పటికీ, గాయం తీవ్రత దృష్ట్యా అతనికి విశ్రాంతి ఇవ్వడమే సరైందని జట్టు యాజమాన్యం నిర్ణయించింది.

తొలి టెస్టు రెండో రోజున గాయపడిన గిల్‌ను కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. అతను వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నప్పటికీ, ఐదు రోజుల టెస్టు మ్యాచ్ భారం గాయాన్ని మరింత తీవ్రం చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం గిల్ పూర్తిగా కోలుకుని, మ్యాచ్‌కు సిద్ధం కావడానికి కనీసం 10 రోజులు పట్టే అవకాశం ఉంది.

ఇక, గిల్ స్థానంలో జట్టులోకి వస్తున్న 24 ఏళ్ల సాయి సుదర్శన్, ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడిన అతను 30.33 సగటుతో 273 పరుగులు సాధించాడు.
Shubman Gill
India vs South Africa
IND vs SA
Sai Sudharsan
India Cricket
Cricket Injury
Guwahati Test
Eden Gardens
Cricket Series
Team India

More Telugu News