AP Cyclone: ఏపీకి పొంచి ఉన్న మరో తుపాన్‌ ముప్పు

Andhra Pradesh Faces Another Cyclone Threat
  • ఈనెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం 
  • రాష్ట్రంలో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్ష సూచన
  • కోత దశలో ఉన్న వరి పంటపై రైతుల్లో ఆందోళన
  • మన్యం ప్రాంతాన్ని వణికిస్తున్న చలిగాలులు
  • జి.మాడుగులలో 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
రాష్ట్రంలో వరి పంట కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది క్రమంగా బలపడి తుపాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంకేతాలు ఇవ్వడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం 22న ఏర్పడే అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి, 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుంది. అయితే, ఇది తుపాన్‌గా మారుతుందా? లేదా? అనే దానిపై ఐఎండీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇస్రోకు చెందిన వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈనెల 25 తర్వాత బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడి దక్షిణ కోస్తాలో తీరం దాటే అవకాశం ఉంది.

మన్యం ఏజెన్సీ గజగజ 
మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ముఖ్యంగా మన్యం ఏజెన్సీ గజగజ వణికిపోతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో బుధవారం ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ముంచంగిపుట్టు మండలం కిలగాడలో 5.8 డిగ్రీలుగా నమోదైంది. ఈ చలి ప్రభావం మరో రెండు, మూడు రోజులు కొనసాగి ఆ తర్వాత తగ్గుతుందని అధికారులు తెలిపారు.

ఇదిలాఉండ‌గా.. రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇవాళ‌ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో.. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
AP Cyclone
Andhra Pradesh Cyclone
Bay of Bengal
IMD
Weather Forecast
Low Pressure
Rain Alert
Coastal Andhra
Alluri Sitarama Raju district
Cyclone Warning

More Telugu News