BS Yediyurappa: పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు సమన్లు

BS Yediyurappa Summoned in POCSO Case
  • డిసెంబర్ 2న విచారణకు హాజరు కావాలని ప్రత్యేక కోర్టు ఆదేశం
  • మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన కేసు
  • యడియూరప్పతో పాటు మరో ముగ్గురికి కూడా నోటీసులు జారీ
  • కేసు కొట్టివేయాలన్న యడ్డీ పిటిషన్‌ను ఇటీవల తోసిపుచ్చిన హైకోర్టు
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు పోక్సో కేసులో ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 2వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

సహాయం కోరేందుకు తన నివాసానికి వచ్చిన ఓ బాలికను యడియూరప్ప లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. 2024 ఫిబ్రవరి 2న ఈ ఘటన జరగ్గా, బాధితురాలి తల్లి సదాశివనగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో యడియూరప్పతో పాటు అరుణ, ఎం. రుద్రేశ్‌, మరిస్వామి అనే మరో ముగ్గురిని కూడా నిందితులుగా చేర్చారు. వారికి సైతం కోర్టు సమన్లు పంపింది.

మంగళవారం జరిగిన విచారణలో ఫిర్యాదిదారుల తరఫున ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ అశోక్‌ ఎస్‌. నాయక్‌ వాదనలు వినిపించారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సుజాత, 30 రోజుల్లోగా సాక్షుల విచారణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశిస్తూ ఈ సమన్లు జారీ చేశారు.

కాగా, తనపై నమోదైన పోక్సో కేసును, సమన్లను రద్దు చేయాలని కోరుతూ యడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రత్యేక కోర్టు తాజా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
BS Yediyurappa
Karnataka
POCSO case
sexual harassment
minor girl
court summons
BJP leader
Sadasivanagar police station
Karnataka High Court

More Telugu News