Nara Bhuvaneswari: 'ఎలీప్' నా కళ్ల ముందే పుట్టి పెరిగి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైంది: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari Says ELEAP Started Through Chandrababu
  • కుప్పంలో నాలుగు రోజుల పర్యటన ప్రారంభించిన నారా భువనేశ్వరి
  • మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే చంద్రబాబు లక్ష్యమన్న భువనేశ్వరి
  • డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామని వెల్లడి
  • కుప్పంలో 'ఎలీప్' సేవలను ప్రశంసించిన భువనేశ్వరి
  • మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ స్థలాల పత్రాల పంపిణీ
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, వారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని ఆమె పేర్కొన్నారు. తన నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా తొలి రోజు ఆమె మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు డ్వాక్రా సంఘాలను స్థాపించారని గుర్తు చేశారు. మహిళలు కేవలం గృహిణులుగా మిగిలిపోకుండా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. "మహిళా శక్తి చాలా గొప్పది. మీలో స్ఫూర్తి రగిలితే ఏదైనా సాధించగలరు. కేవలం శిక్షణ తీసుకున్నాం కదా అని సరిపెట్టుకోకుండా, ఆసక్తితో నేర్చుకుని వ్యాపార రంగంలో రాణించాలి" అని పిలుపునిచ్చారు.

'ఎలీప్' కృషి అభినందనీయం

మహిళల్లోని నైపుణ్యాలను వెలికితీసి, వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఎలీప్) అందిస్తున్న సేవలను భువనేశ్వరి మనస్ఫూర్తిగా అభినందించారు. "'ఎలీప్' నా కళ్ల ముందే పుట్టి పెరిగింది. చంద్రబాబు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. రమాదేవి గారు, ఆమె బృందం ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. త్వరలోనే కుప్పంలో కూడా ఎలీప్ సంస్థను ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా ఇక్కడి మహిళలు శిక్షణ పొంది, మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి" అని ఆకాంక్షించారు.

ప్రభుత్వ ప్రోత్సాహం.. మహిళల బాధ్యత

కుప్పం అభివృద్ధిలో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా 'మహిళా గ్రీన్ పార్క్', 'మహిళా శక్తి భవన్' వంటి ముఖ్యమైన ప్రాజెక్టులను తీసుకొచ్చామని భువనేశ్వరి తెలిపారు. రమాదేవి చెప్పినట్లుగా 14 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే మౌలిక సదుపాయాలు మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రభుత్వం శిక్షణ, ప్రోత్సాహం అందిస్తుందని, అయితే అంతిమ విజయం మహిళల చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. 

"అన్నీ చంద్రబాబు గారో, ఇతరులో చూసుకుంటారని అనుకోవద్దు. ఇది నా అవసరం, నేను ఈ పని చేయగలను అనే పట్టుదల మీలో ఉండాలి. వ్యాపారంలో, కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదు" అని సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వం కేటాయించిన స్థలాల పత్రాలను మహిళా పారిశ్రామికవేత్తలకు నారా భువనేశ్వరి పంపిణీ చేశారు. అనంతరం ఆమె మల్లప్పకొండను సందర్శించి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Nara Bhuvaneswari
Chandrababu Naidu
Kuppam
ELEAP
Women Empowerment
Entrepreneurship
Andhra Pradesh
DWACRA
Women Green Park
Mahila Shakti Bhavan

More Telugu News