Nara Lokesh: ఏపీకి పెట్టుబడుల వెల్లువెత్తిస్తున్న 42 ఏళ్ల స్టాన్ ఫోర్డ్ పట్టభద్రుడు అంటూ రాయిటర్స్ కథనం... నారా లోకేశ్ స్పందన

Nara Lokesh Reuters Article on AP Investments Response
  • ఏపీ వృద్ధి ప్రస్థానంపై రాయిటర్స్ కథనం
  • కథనంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్
  • 16 నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి
  • పారదర్శక పాలన, సంస్కరణలే ఇందుకు కారణమన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న అభివృద్ధి ప్రస్థానంపై, ముఖ్యంగా తన గురించి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం 16 నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్లు) భారీ పెట్టుబడులను ఆకర్షించడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన అన్నారు. వ్యాపార నిర్వహణలో వేగం, పారదర్శకత, సాహసోపేతమైన సంస్కరణల ఎజెండాపై తమ ప్రభుత్వం స్థిరంగా దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమైందని లోకేశ్ వివరించారు. ఈ విజయాల ఫలితంగా సుపరిపాలన, ఆర్థిక పునరుజ్జీవంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాయిటర్స్ కథనం ఇదే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. కేవలం 16 నెలల వ్యవధిలో ఏకంగా 120 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్లు) పెట్టుబడుల ఒప్పందాలను సాధించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన 42 ఏళ్ల నారా లోకేశ్, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక శక్తిగా నిలుస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో తమ పార్టీకున్న పలుకుబడిని ఉపయోగించుకుంటూ, అధికారిక జాప్యాన్ని అధిగమించి, బిలియన్ డాలర్ల ప్రాజెక్టులకు సైతం వేగంగా అనుమతులు సాధిస్తున్నారు.

ఆయన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం, కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉండటం రాష్ట్రానికి ఎంతో కలిసి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యూహం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. టెక్ దిగ్గజం గూగుల్, భారతదేశంలోనే తన అతిపెద్ద పెట్టుబడిగా 15 బిలియన్ డాలర్లతో ఏపీలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా, ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ దాదాపు 17 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారీ స్టీల్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. 

అదానీ గ్రూప్ సైతం ఇప్పటికే రాష్ట్రంలో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా, రాబోయే పదేళ్లలో మరో 12 బిలియన్ డాలర్లను పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఇంధన రంగాల్లో పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. "మీ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నినాదం కేవలం మాటలకే పరిమితం కాలేదు. మాలాంటి పెట్టుబడిదారులకు అది ప్రత్యక్ష అనుభవం" అని అదానీ గ్రూప్ అధినేత కరణ్ అదానీ స్వయంగా ప్రశంసించడం విశేషం.

భారత్‌లో డేటా సెంటర్ కోసం గూగుల్ స్థలాన్ని అన్వేషిస్తోందని తెలియగానే లోకేశ్, ఆయన యువ అధికారుల బృందం రంగంలోకి దిగింది. పన్ను విధానాలు, డేటా భద్రత వంటి అంశాలపై గూగుల్ లేవనెత్తిన సందేహాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి, స్పష్టమైన హామీలు ఇప్పించారు. దీంతో నెలల వ్యవధిలోనే గూగుల్ ఒప్పందం ఖరారైంది. అదేవిధంగా, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం పొరుగు రాష్ట్రం నుంచి ముడి ఖనిజాన్ని తరలించేందుకు అవసరమైన 200 కిలోమీటర్ల స్లర్రీ పైప్‌లైన్‌కు ప్రధాని మోదీ నుంచి తక్షణమే అనుమతులు సాధించారు. "కేంద్ర ప్రభుత్వంలో మాకు బలమైన గొంతు ఉంది. దానివల్లే వేగంగా పనులు జరుగుతున్నాయి" అని లోకేశ్ చెబుతున్నారు. ఈ దూకుడుతో 2029 నాటికి రాష్ట్రానికి 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

అయితే, ఏపీ దూకుడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటక, గూగుల్ డేటా సెంటర్‌ను తాము కోల్పోవడానికి కారణం ఏపీ ప్రభుత్వం విద్యుత్, నీరు, భూమి వంటివాటిపై భారీ రాయితీలు ఇవ్వడమేనని ఆరోపించింది. దీనిపై లోకేశ్ తనదైన శైలిలో స్పందిస్తూ, "ఆంధ్రా భోజనం కారంగా ఉంటుందంటారు. మా పెట్టుబడులు కూడా అలాగే ఉన్నట్లున్నాయి. కొందరు పొరుగువారికి ఆ సెగ అప్పుడే తగులుతోంది!" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు రాయిటర్స్ తన కథనంలో ఈ వివరాలను వెల్లడించింది.
Nara Lokesh
Andhra Pradesh investments
AP development
Reuters article
Google data center AP
Adani Group AP
Arcelor Mittal steel plant
AP economy
Chandrababu Naidu
AP IT sector

More Telugu News