Narendra Modi: ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రం.. పుట్టపర్తి వేదికగా ప్రధాని మోదీ కీలక పిలుపు

Narendra Modi Calls for Vocal for Local at Puttaparthi
  • పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
  • రూ.100 స్మారక నాణెం, తపాలా బిళ్లను విడుదల చేసిన ప్రధాని
  • సాయి బోధించిన ప్రేమ, సేవా మార్గం ప్రపంచానికి ఆదర్శమని వ్యాఖ్య
శ్రీ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవా మార్గాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రూ.100 స్మారక నాణేన్ని, ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరించారు.

హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ.. సత్యసాయి బాబా జీవితం ‘వసుధైవ కుటుంబం’ అనే భారతీయ భావనకు నిలువుటద్దమని కొనియాడారు. "లవ్ ఆల్, సర్వ్ ఆల్" అనే ఆయన సందేశం అజరామరమని, బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్థాపించిన సంస్థలు మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తితో సేవలను కొనసాగిస్తున్నాయని ప్రశంసించారు. భుజ్ భూకంపం వంటి విపత్తుల సమయంలో సత్యసాయి సేవాదళ్ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో 100 గిర్ జాతి ఆవులను పేద కుటుంబాలకు ప్రధాని తన చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ ద్వారా పేదల జీవితాల్లో మార్పు తెస్తున్నామని వివరించారు.

దేశం ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో ముందుకు సాగుతోందని, దీనికి ప్రజా భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని స్వీకరించి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలపడి ‘ఆత్మనిర్భర్ భారత్’ సాకారమవుతుందని పేర్కొన్నారు. సత్యసాయి బాబా ప్రేరణతో కరుణ, శాంతి మార్గంలో పయనిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
Narendra Modi
Sathya Sai Baba
Puttaparthi
Vocal for Local
Atmanirbhar Bharat
Centenary Celebrations
Chandrababu Naidu
Sri Sathya Sai Trust
Rashtriya Gokul Mission
India Development

More Telugu News