Nilayapalem Vijay Kumar: ఏపీలో ఇక ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా: నీలాయపాలెం విజయ్ కుమార్

AP Universal Health Policy Offers 25 Lakh Health Insurance
  • ఏపీలో ప్రతి కుటుంబానికి యూనివర్సల్ హెల్త్ పాలసీ
  • వైద్య సేవల కవరేజీ రూ.25 లక్షలకు పెంపు
  • పేద, ధనిక వర్గాలందరికీ ఈ పథకం వర్తింపు
  • గతంలోని వేర్వేరు ప్యాకేజీల విధానానికి స్వస్తి
  • రాష్ట్రవ్యాప్తంగా 1.63 కోట్ల కుటుంబాలకు మేలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికీ ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం 'యూనివర్సల్ హెల్త్ పాలసీ' అనే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టిందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. ఈ విధానం ద్వారా పేద, ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల వరకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు రూ.2.50 లక్షల వరకు బీమా సంస్థ ద్వారా క్యాష్‌లెస్ వైద్యం అందుతుందని, ఆపై అయ్యే ఖర్చును రూ.25 లక్షల వరకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ భరిస్తుందని వివరించారు. ఈ పాలసీతో రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద వేర్వేరు ప్యాకేజీలు, రేట్లతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని విజయ్ కుమార్ ఆరోపించారు. కానీ, కూటమి ప్రభుత్వం అన్నింటినీ ఒకే ప్యాకేజీ కిందకు తీసుకొచ్చి, అందరికీ ఒకే ప్రమాణాలతో నాణ్యమైన వైద్యం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లోని 31 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

ఈ మార్పుల వల్ల ప్రస్తుత లబ్ధిదారులకు ఎలాంటి నష్టం జరగదని, ఆరోగ్యశ్రీ ఉద్యోగుల భద్రతకు కూడా ఢోకా లేదని హామీ ఇచ్చారు. పాలసీ నిర్వహణ కోసం రాష్ట్రాన్ని శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు జోన్-1గా, గుంటూరు నుంచి రాయలసీమ వరకు జోన్-2గా విభజించినట్లు చెప్పారు. "ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీతో ఏపీని దేశంలోనే ఆరోగ్య రోల్ మోడల్‌గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం" అని విజయ్ కుమార్ అన్నారు.
Nilayapalem Vijay Kumar
Andhra Pradesh
Universal Health Policy
AP Health Insurance
NTR Vaidya Seva Trust
Health Scheme
Cashless Treatment
AP Government
Medical Services
Healthcare

More Telugu News