Shashi Tharoor: ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించిన శశిథరూర్

Shashi Tharoor Praises PM Modi Again Angering Congress Leaders
  • మోదీ ప్రజల సమస్యల విషయంలో ఎమోషనల్ మోడ్‌లో ఉంటారన్న శశిథరూర్
  • వలసవాద ఆలోచన విధానం నుంచి బయటకు రావాలన్న శశిథరూర్
  • వారసత్వం, భాషలు, విజ్ఞాన వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలన్న శశిథరూర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రశంసించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి తనను ఆహ్వానించారని, ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత్ నిర్మాణాత్మక అభివృద్ధి గురించి ప్రసంగించారని ఆయన అన్నారు. 

మోదీ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ ఆయన సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన మరోసారి ప్రధానికి కితాబునిచ్చారు. 

"తాను ఎప్పుడూ ఎన్నికల మోడ్‌లో ఉంటానని అందరూ అంటారని" మోదీ తన ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారని తెలిపారు. ప్రజల సమస్యల విషయంలో ఆయన ఎప్పుడూ ఎమోషనల్ మోడ్‌లో ఉంటారని కితాబిచ్చారు. దేశంలో విద్యపై వలసవాదం ప్రభావం ఏ విధంగా ఉందనే విషయం గురించి మోదీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.

వలసవాద ఆలోచనా విధానం నుంచి బయటపడాలంటే భారతదేశ వారసత్వం, భాషలు, విజ్ఞాన వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని శశిథరూర్ అన్నారు. ప్రధాని మోదీకి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

శశిథరూర్ చేసిన ఈ పోస్టుపై సొంత పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా శశిథరూర్ ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుండటం కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం కలిగిస్తోంది.
Shashi Tharoor
Narendra Modi
Indian National Congress
Prime Minister Modi
Delhi

More Telugu News