Prashant Kishor: ఓటమికి బాధ్యత వహిస్తూ మౌనదీక్ష చేపట్టబోతున్న ప్రశాంత్ కిశోర్

Bihar Election Loss Prashant Kishor to Observe Silent Protest
  • బీహార్ ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత తనదేనన్న ప్రశాంత్ కిశోర్
  • ప్రజల నమ్మకాన్ని గెలవడంలో విఫలమయ్యామని అంగీకారం
  • ప్రాయశ్చిత్తంగా ఈ నెల 20న మౌన ఉపవాసం చేయనున్నట్లు ప్రకటన
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. ఫలితాల అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ఆయన, తమ పార్టీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేకపోయిందని అంగీకరించారు. ఈ వైఫల్యానికి ప్రాయశ్చిత్తంగా ఈ నెల 20న గాంధీ భీతిహర్వా ఆశ్రమంలో ఒకరోజు మౌన ఉపవాసం చేయనున్నట్లు తెలిపారు.

"బీహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త పాత్ర పోషించాం. కానీ ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మా ఆలోచనల్లోనే ఎక్కడో లోపం ఉండి ఉంటుంది. వంద శాతం బాధ్యత నాదే. చాలా నిజాయతీగా ప్రయత్నించాం, కానీ విఫలమయ్యాం. ఈ నిజాన్ని అంగీకరించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు" అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. గత మూడేళ్లుగా తన శక్తినంతా ధారపోసి పనిచేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీకే స్పష్టం చేశారు. బీహార్‌ను బాగు చేయాలనే తన సంకల్పం నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. "నేను తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఎలాంటి నేరం చేయలేదు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టలేదు. హిందూ-ముస్లిం రాజకీయాలు చేయలేదు. డబ్బులిచ్చి ఓట్లు కొనే నేరానికి పాల్పడలేదు" అని వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్.. ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడమే కాకుండా, అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం.
Prashant Kishor
Bihar Election
Jan Suraaj Party
Election Strategist
Political strategist
Gandhi Bhitiharwa Ashram
Bihar Politics
Silent Protest

More Telugu News