Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష... ట్రైబ్యునల్ సంచలన తీర్పు

Sheikh Hasina Sentenced to Death by Tribunal Former PM Reacts
  • షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలు
  • షేక్ హసీనాను దోషిగా తేల్చిన అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్
  • మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన ట్రైబ్యునల్
బంగ్లాదేశ్‌లో గత సంవత్సరం జరిగిన అల్లర్ల కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. వాదనలు విన్న ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. అనంతరం ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

గత సంవత్సరం రిజర్వేషన్ల కోసం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారి అవామీ లీగ్ గద్దె దిగడానికి కారణమైంది. ఆందోళనకారుల బారి నుంచి తప్పించుకోవడానికి షేక్ హసీనా ప్రత్యేక విమానంలో భారత్‌కు వచ్చారు. ఏడాదికి పైగా ఆమె ఢిల్లీలోని గుర్తు తెలియని ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.

తనపై జరిగిన సుదీర్ఘ విచారణను ఇటీవల షేక్ హసీనా న్యాయశాస్త్రంలో ఒక జోక్‌గా అభివర్ణించారు. షేక్ హసీనా పాలన ముగిసి, తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. 2026 ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో రాజకీయంగా అస్థిరత నెలకొంది.


Sheikh Hasina
Bangladesh
Awami League
International Crimes Tribunal
Bangladesh Politics

More Telugu News