Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్

Sheikh Hasina found guilty by International Crimes Tribunal
  • మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు
  • తనకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చారన్న న్యాయమూర్తి
  • నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించారని పేర్కొన్న న్యాయమూర్తి
బంగ్లాదేశ్‌లో గత ఏడాది జరిగిన అల్లర్ల కేసులో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను ఆదేశంలోని అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆమెకు గరిష్ఠ శిక్ష పడే అవకాశం ఉంది. గత ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో జరిగిన ఆందోళనలలో 1,400 మంది మృతి చెందారని న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.

గత ఏడాది ఆగస్టు 5న ఢాకాలో నిరసనలపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించేందుకు నిరాకరించారని పేర్కొన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని తెలిపారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యమైతే క్షమించాలని విజ్ఞప్తి చేశారు.

షేక్ హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా ఆల్‌మామున్‌లు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ట్రైబ్యునల్ తీర్పులో పేర్కొంది. హత్య, హత్యాయత్నం, హింసతో పాటు ఇతర అమానవీయ చర్యలకు వారు పాల్పడినట్లు ట్రైబ్యునల్ పేర్కొంది. 

కాగా, ఈ తీర్పునకు ముందు దేశ రాజధాని ఢాకా, మరికొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగడంతో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం భద్రతను పెంచింది.

తీర్పు నేపథ్యంలో ఢాకా సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. వాహనాలు తగులబెట్టేందుకు ప్రయత్నిస్తే, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇచ్చారు.
Sheikh Hasina
Bangladesh
International Crimes Tribunal
Dhaka
Awami League
crime tribunal verdict

More Telugu News