Pawan Kalyan: ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్... సజ్జనార్ కు పవన్ కల్యాణ్ అభినందనలు

Pawan Kalyan Applauds Sajjanar Arrest in Ibomma Case
  • ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందన
  • పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన
  • బెట్టింగ్, పొంజీ స్కీమ్‌లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ చర్యలనూ కొనియాడిన పవన్
  • ఈ చర్యలు భారత సినీ పరిశ్రమకు మేలు చేస్తాయని వ్యాఖ్య
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లు ‘ఐబొమ్మ’, ‘బప్పం టీవీ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పైరసీపై ఉక్కుపాదం మోపడం స్వాగతించదగ్గ పరిణామమని ట్వీట్ చేశారు. 

"సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్ కి అభినందనలు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదు. 

పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామం. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ వీసీసజ్జనార్ కు అభినందనలు తెలియచేస్తున్నాను. 

బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో సజ్జనార్ చైతన్యపరుస్తున్నారు. ఆయనతో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చింది. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి" అని పవన్ కల్యాణ్ వివరించారు. 
Pawan Kalyan
Ibomma
VC Sajjanar
cyber crime
piracy website
Baddam TV
movie piracy
Hyderabad police
ponzi schemes
betting apps

More Telugu News