Lalu Prasad Yadav: లాలూ కుటుంబంలో ముసలం.. ఇల్లు విడిచి వెళ్లిన మరో ముగ్గురు కుమార్తెలు

Lalu Prasad Yadav Family Crisis Three Daughters Leave Home
  • లాలూ యాదవ్ కుటుంబంలో ముదిరిన సంక్షోభం
  • తేజస్వి అనుచరులు దూషించారంటూ రోహిణి ఆరోపణలు
  • చెల్లెలి అవమానంపై అన్న తేజ్ ప్రతాప్ తీవ్ర ఆగ్రహం
  • బీహార్ ఎన్నికల ఓటమితో ఆర్జేడీలో అంతర్గత కుమ్ములాటలు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో మొదలైన సంక్షోభం మరింత ముదురుతోంది. ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కుటుంబంతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే, మరో ముగ్గురు కుమార్తెలు పాట్నాలోని ఇంటిని విడిచివెళ్లడం రాజకీయంగా కలకలం రేపుతోంది. రాగిణి, చందా, రాజలక్ష్మి తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి పయనమయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి ఆర్జేడీలో మొదలైన కుమ్ములాటలు ఇప్పుడు కుటుంబంలో చిచ్చు రేపాయి.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి తర్వాత లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తాను రాజకీయాల నుంచి, కుటుంబం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తేజస్వి యాదవ్ సన్నిహితులైన సంజయ్ యాదవ్, రమీజ్ తనను దారుణంగా దూషించారని, చెప్పుతో కొట్టేందుకు కూడా ప్రయత్నించారని ఆమె సోషల్ మీడియాలో ఆరోపించారు. తన తండ్రికి కిడ్నీ దానం చేసినందుకు కోట్లు తీసుకున్నానని నిందలు వేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో రాగిణి, చందా, రాజలక్ష్మి కూడా ఇంటిని వీడటంతో లాలూ, రబ్రీదేవి, మిసా భారతి మాత్రమే పాట్నా నివాసంలో మిగిలారు. తేజస్వి యాదవ్ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు.

మరోవైపు, చెల్లెలు రోహిణికి జరిగిన అవమానంపై ఆమె సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. "చెల్లెలిని అవమానిస్తే సహించేది లేదు. నాన్న, మీరు ఒక్క సైగ చేయండి.. ఈ జైచంద్‌లను బీహార్ ప్రజలతో పాతిపెట్టిస్తా" అని హెచ్చరించారు. కొందరి వల్లే తేజస్వి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ఓటమి, కుటుంబంలో విభేదాలతో ఆర్జేడీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
Lalu Prasad Yadav
Rohini Acharya
RJD
Bihar politics
Tej Pratap Yadav
Tejaswi Yadav
Family feud
Bihar assembly elections
Political crisis
Rabri Devi

More Telugu News