Cyber Crime: బెంగళూరులో భారీ సైబర్ మోసం బట్టబయలు.. మైక్రోసాఫ్ట్ పేరుతో విదేశీయులకు టోపీ

Bengaluru Cyber Crime Busted Microsoft Tech Support Scam
  • 'డిజిటల్ అరెస్ట్' అంటూ బెదిరించి డబ్బు వసూలు
  • మస్క్ కమ్యూనికేషన్ అనే ఫేక్ కంపెనీపై పోలీసుల దాడులు
  • సంస్థలో పనిచేస్తున్న 21 మంది ఉద్యోగులను అరెస్ట్ చేసిన సీఐడీ
  • కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల స్వాధీనం
కర్ణాటక రాజధాని బెంగళూరులో అంతర్జాతీయ సైబర్ మోసానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ పేరుతో అమెరికా సహా పలు దేశాల పౌరులను మోసగిస్తున్న నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీపై దాడి చేసి 21 మందిని అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని సిగ్మా సాఫ్ట్‌ టెక్ పార్కులో గత ఆగస్టులో "మస్క్ కమ్యూనికేషన్" పేరుతో ఒక నకిలీ సంస్థ ఏర్పాటైంది. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అమెరికాతో పాటు ఇతర దేశాల పౌరులకు ఆన్‌లైన్‌లో ఫోన్లు చేసి, తాము మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల నుంచి మాట్లాడుతున్నామని నమ్మించేవారు. వారి ల్యాప్‌టాప్‌లను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేవారు.

ఆ తర్వాత, బాధితులపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించి "డిజిటల్ అరెస్ట్" చేసేవారని పోలీసులు తెలిపారు. తామే పోలీసులమని, ఈ కేసు నుంచి బయటపడేందుకు సాయం చేస్తామని చెప్పి, వారి నుంచి భారీగా డబ్బును వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేయించుకునేవారని గుర్తించారు.

కచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన కర్ణాటక సీఐడీ సైబర్ కమాండ్ సెంటర్ విభాగం, కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొంది మస్క్ కమ్యూనికేషన్ కార్యాలయంపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థలో పనిచేస్తున్న 21 మంది ఉద్యోగులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Cyber Crime
Bengaluru Cyber Crime
Microsoft
Musk Communication
Karnataka CID
Money Laundering
Online Fraud
Cyber Fraud
Whitefield Police Station

More Telugu News