Kavitha: కారణజన్ముడి కడుపులో రాక్షసి పుట్టింది.. కవితపై బీఆర్ఎస్ నేతల తీవ్ర వ్యాఖ్యలు

Kavitha Criticized by BRS Leaders as a Demon Born to a Righteous Man
  • రేవంత్‌తో చేతులు కలిపి పార్టీపై కవిత విమర్శలు చేస్తున్నారని ఆరోపణ
  • హరీశ్‌రావుకు కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని చింతా ప్రభాకర్ డిమాండ్
  • కాంగ్రెస్ ట్రాప్‌లో కవిత పడ్డారన్న బీఆర్ఎస్ విప్ వివేకానంద
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "కారణజన్ముడి కడుపున కవిత లాంటి రాక్షసి పుట్టడం దురదృష్టకరం" అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై తన వ్యాపారాలను కాపాడుకునేందుకే కవిత.. తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌తో పాటు పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

నిన్న సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతితో కలిసి చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఆమెకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఇప్పుడు 'జనం బాట' పేరుతో యాత్ర చేస్తూ ప్రజా సమస్యలను వదిలేసి, హరీశ్‌రావును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి ఏడు సీట్లు గెలిపించిన హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలకు కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. "నిజామాబాద్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?" అని ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రశ్నించగా, కేసీఆర్ కుమార్తెగానే కవితకు గుర్తింపు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతి అన్నారు.

మరోవైపు, హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద మాట్లాడుతూ.. కవిత కాంగ్రెస్ ట్రాప్‌లో పడ్డారని, ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు. పదేళ్లు పదవుల్లో ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు గుర్తుకొస్తున్నాయని ఆయన నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కవిత మాట తీరు మారిందని విమర్శించారు. కేటీఆర్, హరీశ్‌రావులపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివేకానంద తెలిపారు.
Kavitha
Kalvakuntla Kavitha
BRS
Chinta Prabhakar
KCR
KTR
Harish Rao
Telangana
Liquor Scam
Revanth Reddy

More Telugu News