Rajasthan Crime: జోధ్‌పూర్‌లో దారుణం: పెళ్లి కావడం లేదని.. 17 రోజుల పసికందును బలిచ్చిన పిన్నమ్మలు!

Desperate To Get Married 4 Women Trample 16 Day Old Nephew To Death
  • జోధ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
  • పెళ్లిళ్లు కావడం లేదని పసికందును చంపిన యువతులు
  • 17 రోజుల శిశువును కాళ్లతో తొక్కి చంపిన వైనం
  • భైరు దేవతను ప్రసన్నం చేసుకునేందుకే ఈ ఘాతుకం
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అత్యంత పాశవికమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 17 రోజుల వయసున్న ఓ పసికందును నరబలి ఇచ్చారన్న ఆరోపణలపై నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చిన్నారికి స్వయానా పిన్నమ్మలు (తల్లి సోదరీమణులు) కావడం గమనార్హం. మూఢనమ్మకాలతోనే వారు ఈ ఘోరానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. గుజరావాస్‌కు చెందిన సుమన్‌ అనే మహిళ ప్రసవం కోసం నెలన్నర క్రితం పుట్టింటికి వచ్చారు. 17 రోజుల క్రితం ఆమెకు కుమారుడు ప్రత్యుక్ష్ జన్మించాడు. శుక్రవారం రాత్రి సుమన్ బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో, ఆమె నలుగురు సోదరీమణులు కలిసి పసికందును కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ మహిళ ఒడిలో పసికందును పెట్టుకుని మంత్రాలు చదువుతుండగా, మిగిలిన వారు పక్కనే కూర్చుని ఉండటం కనిపిస్తోంది.

తమకు పెళ్లిళ్లు కావడం లేదన్న అక్కసుతో, అసూయతోనే తన భార్య సోదరీమణులు ఈ దారుణానికి పాల్పడ్డారని శిశువు తండ్రి పూనమ్‌రామ్ ఆరోపించారు. "మొదట చిన్నారి కాళ్లు, చేతులు విరగ్గొట్టి, ఆపై కాళ్లతో తొక్కి, గొంతు నులిమి చంపేశారు. జుట్టు కూడా పీకేశారు. నా భార్యకు ఇద్దరు పిల్లలు ఉండటం, ఆమె కుటుంబ జీవితం సజావుగా సాగడం చూసి ఓర్వలేకపోయారు," అని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

తెల్లవారుజామున 3:30 గంటలకు తన భార్య ఫోన్ చేసి విషయం చెప్పిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నలుగురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాంత్రిక పూజలు, నరబలి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
Rajasthan Crime
Jodhpur
Infant Sacrifice
Superstition
Marriage Problems
Bhairu
Rajasthan Police
Child Murder
Aunt
Ritual Killing

More Telugu News