Nitish Kumar: పదోసారి సీఎంగా నితీశ్ కుమార్... బీహార్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

Nitish Kumar Sworn in as Bihar CM for the Tenth Time
  • బీహార్ సీఎంగా పదోసారి ప్రమాణం చేయనున్న నితీశ్ కుమార్
  • ఈనెల 19 లేదా 20న కొత్త ప్రభుత్వ ఏర్పాటు
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఖరారైన కేబినెట్ కూర్పు
  • మంత్రివర్గంలో బీజేపీకే అధిక ప్రాధాన్యం..16 పదవులు
  • జేడీయూకు 14.. ఇతర మిత్రపక్షాలకు మంత్రి పదవులు
  • ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ
బీహార్ సీఎంగా జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆయన పదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 19 లేదా 20వ తేదీన ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చినట్లు స‌మాచారం. మంత్రివర్గంలో బీజేపీకి సింహభాగం దక్కనుంది. కమలం పార్టీకి 15 నుంచి 16 మంత్రి పదవులు కేటాయించనుండగా, జేడీయూకు 14 పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. వీటితో పాటు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీకి మూడు, జితన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎంకు ఒకటి, ఆర్‌ఎల్‌ఎంకు ఒక మంత్రి పదవి చొప్పున కేటాయించనున్నట్లు సమాచారం.

బీహార్‌లో 18వ అసెంబ్లీ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇవాళ‌ నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రస్తుత కేబినెట్ సమావేశమై 17వ శాసనసభను రద్దు చేస్తూ తీర్మానం చేయనుంది. అనంతరం ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పిస్తారు. ఆ తర్వాత ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో నితీశ్‌ను తమ నేతగా అధికారికంగా ఎన్నుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్‌ను బట్టి ప్రమాణస్వీకార తేదీని బుధ లేదా గురువారాల్లో ఖరారు చేయనున్నారు.
Nitish Kumar
Bihar
Bihar Government
JDU
NDA
Narendra Modi
Amit Shah
Bihar Politics
Chief Minister

More Telugu News