Mohiuddin: విరుగుడు లేని విషం.. ఆముదం గింజలతో ఉగ్రవాదుల కొత్త వ్యూహం.. దేశంలో విధ్వంసానికి ప్లాన్!

Ricin Poison Plot Mohiuddin Arrested in Gujarat ATS Operation
  • ఆముదం గింజల నుంచి ప్రాణాంతకమైన రెసిన్ విషం తయారీ
  • రెండు ఉప్పు రవ్వలంత పరిమాణంతోనే మనిషిని చంపగలదు
  • ఈ విషానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విరుగుడు లేదు
  • శరీరంలోకి వెళ్తే 36 నుంచి 72 గంటల్లో మరణం 
  • ఆముదం గింజలు ఆన్‌లైన్‌లోనూ సులభంగా దొరకడంపై ఆందోళన
దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కొత్త, అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఉప్పు రవ్వలంత పరిమాణంతో మనిషి ప్రాణాలను తీయగల 'రెసిన్' అనే విషాన్ని ఆయుధంగా వాడేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈ విషానికి ప్రపంచంలో ఎక్కడా విరుగుడు లేకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఇటీవల గుజరాత్ ఉగ్రవాద నిరోధక విభాగం (ఏటీఎస్) అరెస్ట్ చేసిన హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు మొహియుద్దీన్, రెసిన్ తయారుచేసే పనిలో ఉన్నట్లు తేలడంతో నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

సులభంగా లభ్యం
సాధారణంగా లభించే ఆముదం గింజల నుంచి రెసిన్‌ను తయారుచేస్తారు. గింజలను గుజ్జుగా మార్చి, ఒక ప్రత్యేక విధానంలో ఈ విషాన్ని సంగ్రహిస్తారు. మొహియుద్దీన్ వద్ద 4 కిలోల ఆముదం గుజ్జును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఈ కుట్ర బయటపడింది. మన దేశంలో ఆముదం గింజలు చాలా సులభంగా లభిస్తాయి. ఆన్‌లైన్‌లో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా అమ్ముతుండటం ఇప్పుడు పెను ముప్పుగా మారింది. రెసిన్ పొడి, ద్రవం లేదా పొగమంచు రూపంలోకి మార్చి ఆహారం, నీటిలో కలపడం ద్వారా లేదా ఇంజెక్షన్ రూపంలో ప్రయోగించే వీలుంది.

ఎలా పనిచేస్తుంది?
వైద్య నిపుణుల ప్రకారం రెసిన్ శరీరంలోకి ప్రవేశించాక కణాలకు ప్రోటీన్ అందకుండా అడ్డుకుంటుంది. దీంతో శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా విఫలమై 36 నుంచి 72 గంటల్లో బాధితుడు మరణిస్తాడు. దీనికి ఎలాంటి విరుగుడు లేదని, లక్షణాల ఆధారంగా కేవలం సహాయక చికిత్స మాత్రమే అందించగలమని ఒక  వైద్యుడు  తెలిపారు. గతంలో బల్గేరియా తిరుగుబాటు నేత జార్జి మార్కోవ్ హత్య, అమెరికా అధ్యక్షుడికి వచ్చిన పార్శిల్‌లోనూ రెసిన్‌ను గుర్తించారు. ఇప్పుడు మన దేశంలో ఉగ్రవాదులు దీనిపై దృష్టి సారించడం భద్రతా సంస్థలకు కొత్త సవాలుగా మారింది.
Mohiuddin
Ricinus communis
Ricin poison
Gujarat ATS
Terrorist plot India
Castor seeds
Bioterrorism
Weapon of mass destruction
Dr Neeraj Tyagi
Hyderabad doctor

More Telugu News