Andhra Pradesh Weather: మరో అల్ప పీడనం... ఏపీలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Andhra Pradesh Weather Alert Heavy Rains Forecast
  • దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు హెచ్చరిక
  • తిరుపతి, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన
  • తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఈ అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కనిష్ఠ స్థాయికి పడిపోతుండగా, మరికొన్ని చోట్ల 35 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇప్పుడు వర్ష సూచన రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Andhra Pradesh Weather
AP Weather
Heavy Rains
IMD
Low Pressure
Rayalaseema
South Coastal Andhra
Tirupati
Nellore

More Telugu News