Pawan Kalyan: ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పవన్ ఉక్కుపాదం

Pawan Kalyan Vows Strict Action Against Red Sanders Smuggling
  • ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష
  • స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్‌కు మళ్లీ జీవం పోస్తామన్న పవన్
  • గత ఐదేళ్లలో లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేశారని ఆరోపణ
  • ఎర్రచందనం ఆదాయంలో కొంత భాగం వనాల సంరక్షణకే కేటాయిస్తామన్న పవన్
రాష్ట్ర అమూల్య సంపద అయిన ఎర్రచందనం పరిరక్షణకు, అక్రమ రవాణా నిరోధానికి ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా బయటకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం అటవీశాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన, ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతాన్ని తిరిగి వనాల అభివృద్ధి, సంరక్షణకే కేటాయించే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
 
గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ ఫోర్స్‌ ను నిర్వీర్యం చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. 2019 -24 మధ్య కాలంలో లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారని, తిరుపతిలోని గోదాముల్లో పట్టుబడిన దుంగలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కానివ్వబోమని, స్మగ్లింగ్ కింగ్‌పిన్‌లను చట్టం ముందు నిలుపుతామని హెచ్చరించారు. పోలీసు, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి అక్రమార్కుల ఆట కట్టించాలని ఆదేశించారు.
 
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పవన్ సూచించారు. స్మగ్లింగ్ జరిగే మార్గాల్లో థర్మల్ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, చెక్ పోస్టులను పటిష్టం చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేపాల్, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన వందలాది టన్నుల ఎర్రచందనాన్ని వెనక్కి తెచ్చే ప్రక్రియ వేగవంతం చేశామని తెలిపారు. అటవీ సిబ్బంది ఎర్రచందనం సంరక్షణను ఒక సంకల్పంగా తీసుకోవాలని, సమాచారం చేరవేసే ఇంటి దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Pawan Kalyan
Errachandanam
Red Sanders
Smuggling
Andhra Pradesh
Seshachalam Forests
Forest Department
Illegal Logging
Task Force
Timber Smuggling

More Telugu News