Andre Russell: ఆండ్రీ రసెల్ ను విడుదల చేసిన కేకేఆర్

Andre Russell Released by KKR Ahead of IPL 2026 Mega Auction
  • ఐపీఎల్ 2026 వేలానికి ముందు కేకేఆర్ సంచలనం
  • స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌ను వదులుకున్న కోల్‌కతా
  • వెంకటేశ్ అయ్యర్‌తో పాటు పలువురు కీలక ఆటగాళ్ల రిలీజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మెగా వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంగా జట్టుకు మూలస్తంభంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌ను రిటైన్ చేసుకోకుండా వేలానికి వదిలేసింది. గత మెగా వేలంలో రూ.12 కోట్లకు అట్టిపెట్టుకున్న ఈ విండీస్ వీరుడిని ఇప్పుడు వదులుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
 
2014 నుంచి కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రస్సెల్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. 2014, 2024లో కేకేఆర్ టైటిల్ గెలిచిన జట్లలోనూ సభ్యుడిగా ఉన్నాడు. అయితే, రస్సెల్ రిటైర్ అయ్యే వరకు కేకేఆర్‌లోనే కొనసాగుతాడని 2020లో ఫ్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను యాజమాన్యం నిలబెట్టుకోలేదంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
రస్సెల్‌తో పాటు, అత్యధిక ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు)ను కూడా కేకేఆర్ వదులుకుంది. వీరితో పాటు క్వింటన్ డికాక్, మొయిన్ అలీ, ఆన్రిచ్ నోకియా, రహ్మనుల్లా గుర్బాజ్ వంటి కీలక ఆటగాళ్లను కూడా రిలీజ్ చేసింది. ఈ నిర్ణయాలతో ప్రస్తుతం కేకేఆర్ వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. జట్టులో 13 ఖాళీలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో వేలంలోకి వెళ్తున్నందున, తక్కువ ధరకు రస్సెల్‌ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేకేఆర్ తరఫున 133 మ్యాచ్‌లు ఆడిన రస్సెల్, 2,593 పరుగులు చేశాడు.
Andre Russell
KKR
Kolkata Knight Riders
IPL 2026
Venkatesh Iyer
Quinton de Kock
Moeen Ali
Anrich Nortje
Rahmanullah Gurbaz

More Telugu News