Dasoju Shravan: జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బలం కంటే.. నవీన్ యాదవ్ హవానే ఎక్కువ: బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్

Dasoju Shravan says Naveen Yadav is stronger than Congress in Jubilee Hills
  • జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంటే అజారుద్దీన్‌కు టిక్కెట్ ఎందుకివ్వలేదని ప్రశ్న
  • గెలిచింది రేవంత్ రెడ్డి కాదు.. నవీన్ యాదవ్ అన్న దాసోజు శ్రవణ్
  • ఒవైసీ కాళ్లు మొక్కి, బండి సంజయ్‌తో కుమ్మక్కై గెలిచారని ఆరోపణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పలు సర్వేల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలం కంటే నవీన్ యాదవ్ ప్రాబల్యం ఎక్కువని తేలిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకే బలం ఉంటే అజారుద్దీన్‌కు తిరిగి టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

గతంలో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్‌కు టిక్కెట్ ఇవ్వడం ద్వారా, మీకు గెలుస్తామనే విశ్వాసం లేదని స్పష్టమవుతోందని అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి చెందిన గణేశ్‌ను తీసుకువచ్చి టిక్కెట్ ఇచ్చారని, కానీ గద్దర్ కుమార్తెకు మాత్రం టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. సొంత పార్టీలో ఉన్నవారిని విస్మరిస్తూ బీజేపీ, మజ్లిస్ పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్ ఇచ్చారని ఆరోపించారు.

జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి గెలవలేదని, నవీన్ యాదవ్ గెలిచారని ఆయన అన్నారు. తాను అమలు చేసిన పథకాల వల్లే గెలిచానని రేవంత్ రెడ్డి భావిస్తే అది పొరపాటు అని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉందని, గెలుపోటములు సహజమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను కూడా బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోయారని, ఆయన గతంలో ఎంపీగా గెలిచిన మల్కాజ్‌గిరిలో ఎందరు కార్పొరేటర్లను గెలిపించారని ప్రశ్నించారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ కాళ్లు మొక్కి, బండి సంజయ్‌తో కుమ్మక్కై మజ్లిస్ ఓట్లతో పాటు బీజేపీ ఓట్లను బదిలీ చేసుకోవడం ద్వారా గెలిచారని ఆయన విమర్శించారు.
Dasoju Shravan
Revanth Reddy
Jubilee Hills by election
Naveen Yadav
BRS Party

More Telugu News