RJD: బీహార్ ఫలితాలపై స్పందించిన ఆర్జేడీ... సమస్యంతా ఆ పార్టీతోనే అన్న ప్రశాంత్ కిశోర్ పార్టీ

RJD Responds to Bihar Election Results
  • ఒడుదొడుకులు ఎదురైనా ప్రజాసేవ కొనసాగుతూనే ఉంటుందన్న ఆర్జేడీ
  • ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అన్న ఆర్జేడీ
  • ఆర్జేడీ గెలిస్తే ఆటవిక రాజ్యం వస్తుందనే భయంతో అందరూ ఎన్డీయే వైపు మళ్లారన్న జన్ సురాజ్ పార్టీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తొలిసారిగా స్పందించింది. ఓటమి పట్ల విచారం, విజయంతో అహంకారం ఉండకూడదని ఆర్జేడీ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాలను గెలుచుకోగా, మహాఘట్‌బంధన్ 35 సీట్లకు పరిమితమైంది. ఆర్జేడీ 25 స్థానాలను దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ స్పందిస్తూ, ఒడుదొడుకులు ఎదురైనా ప్రజాసేవ కొనసాగుతూనే ఉంటుందని తెలిపింది. ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ అని, అది ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో ఒడుదొడుకులు సహజమని అభిప్రాయపడింది. ఓటమితో విచారం, విజయంతో అహంకారం తమ దరిచేరదని స్పష్టం చేసింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి మధ్య ఉంటూ వారి గొంతుకను వినిపిస్తూనే ఉంటుందని తెలిపింది.

ఫలితాలపై స్పందించిన జన్ సురాజ్ పార్టీ

ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ కూడా స్పందించింది. 238 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఫలితాలపై స్పందిస్తూ, ఆర్జేడీ మళ్లీ అధికారంలోకి వస్తే అటవిక రాజ్యం వస్తుందనే భయంతో తమకు మద్దతుగా నిలవాల్సిన వారిలో చాలామంది ఎన్డీయే వైపు మొగ్గు చూపారని పేర్కొంది. ఎర్రకోట వద్ద పేలుడు అనంతరం సీమాంచల్ ప్రాంతంలో ఓటర్లు ఒక వర్గం వైపు మళ్లారని తెలిపింది. సమస్య అంతా ఆర్జేడీతోనే అని, కాంగ్రెస్ లేదా మహాఘట్‌బంధన్‌లోని ఇతర పార్టీలతో కాదని అభిప్రాయపడింది.
RJD
Bihar Election Results
Rashtriya Janata Dal
Prashant Kishor
Jan Suraaj Party

More Telugu News