Nara Lokesh: కుటుంబానికో పారిశ్రామికవేత్తే లక్ష్యం: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Aims for One Entrepreneur Per Family in AP
  • ఏపీలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఆర్ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్
  • 2029 నాటికి 20 వేలకు పైగా స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాల కల్పన ధ్యేయమ‌న్న లోకేశ్‌
  • ఇన్నోవేషన్లను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు
  • స్టార్టప్‌లకు ప్రభుత్వమే తొలి కస్టమర్‌గా ఉంటుందని ప్రకటన
  • మంత్రి లోకేశ్‌ సమక్షంలో 6 సంస్థలతో కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ల హబ్‌గా, దేశానికి టెక్ రాజధానిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. "కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త" అన్నదే తమ ప్రభుత్వ దార్శనికత అని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆర్ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.10,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలిపారు.

సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో 'ఆర్ టిఐహెచ్-వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్' అంశంపై జరిగిన సదస్సులో లోకేశ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2029 నాటికి రాష్ట్రాన్ని ఇన్నొవేషన్ ఆధారిత వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దీని ద్వారా 20,000కు పైగా స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలు సృష్టించడమే ధ్యేయమని వివరించారు. ఇది కేవలం స్టార్టప్‌ల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని, విద్యార్థుల నుంచి ప్రభుత్వ శాఖల వరకు అందరిలోనూ ఇన్నోవేషన్ మైండ్‌సెట్ కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు.

ఈ దార్శనికతకు కార్యరూపం ఇచ్చేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలు, పెట్టుబడిదారులను ఇది ఒకే వేదికపైకి తెస్తుందన్నారు. స్టార్టప్‌లకు ప్రభుత్వమే తొలి కస్టమర్‌గా ఉంటుందని, ప్రభుత్వ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు హ్యాకథాన్‌లు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ లక్ష్యాల సాధన కోసమే 'ఏపీ ఇన్నోవేషన్ & స్టార్టప్ పాలసీ 2024'ను ప్రవేశపెట్టినట్టు లోకేశ్‌ వెల్లడించారు.

మంత్రి లోకేశ్‌ సమక్షంలో 6 సంస్థలతో ఎంవోయూ
ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి లోకేశ్‌ సమక్షంలో 6 సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) జరిగాయి. ముఖ్యంగా ఆర్ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, స్టార్టప్ యూఏఈ, క్వాంటమ్ ఏఐ, ఏపీ వాగ వంటి ఇతర సంస్థలతోనూ ఒప్పందాలు కుదిరాయి. ఈ కార్యక్రమంలో ఆర్ టీఐహెచ్ సీఈఓ ధాత్రి రెడ్డి, టాటా ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి అరోరా తదితరులు పాల్గొన్నారు.


Nara Lokesh
Andhra Pradesh
AP Innovation
Startup Policy 2024
RRP Electronics
Ratan Tata Innovation Hub
RTIH
AP Wag
Startups UAE
Quantum AI

More Telugu News