Narendra Modi: గంగా నదిలానే బీజేపీ విజయం కూడా.. బీహార్ లో గెలుపుపై మోదీ కీలక వ్యాఖ్యలు

Narendra Modi Comments on BJP Victory Like Ganga River
  • గంగా నది బీహార్ మీదుగా బెంగాల్ కు పారుతుందన్న ప్రధాని
  • బీహార్ లో బీజేపీ గెలుపు బెంగాల్ లో విజయానికి మార్గం సుగమమని వెల్లడి
  • పార్టీ కార్యకర్తలే బీజేపీకి బలమన్న మోదీ
"గంగా నది బీహార్ మీదుగా పశ్చిమ బెంగాల్ కు పారుతుంది.. ఆ నదిలాగానే బీజేపీ విజయం కూడా.." అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. పార్టీ ఆఫీసుకు వచ్చిన మోదీకి కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ మోదీని గజమాలతో సత్కరించారు. అనంతరం నరేంద్ర మోదీ పార్టీ నేతలు, కార్యర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కార్యకర్తలే బీజేపీకి బలమని పేర్కొన్నారు. ‘మీ ఆశలే నా ఆశయాలు, మీ కలలే నాకు స్ఫూర్తి, పార్టీకి మీరే బలం’ అంటూ కార్యకర్తలపై పొగడ్తల వర్షం కురిపించారు. బీహార్ లో బీజేపీ సంచలన విజయానికి కార్యకర్తల నిర్విరామ కృషే కారణమన్నారు. 

గంగా నది బీహార్ నుంచి బెంగాల్ కు ప్రవహిస్తుందని, బీహార్ లో బీజేపీ విజయం బెంగాల్ లో పార్టీ విజయానికి మార్గం చూపుతోందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క బెంగాల్ మాత్రమే కాదు, ఈ విజయం దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్టీని విజయతీరాలకు చేర్చేలా కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని మోదీ చెప్పారు. బీహార్ లో జంగిల్ రాజ్ పాలనను అంతమొందించినట్లే పశ్చిమ బెంగాల్ లోనూ జంగిల్ రాజ్ ను తరిమికొట్టాలని అక్కడి బీజేపీ కార్యకర్తలకు మోదీ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలని పార్టీ కార్యకర్తలకు మోదీ సూచించారు.
Narendra Modi
Bihar Election Results
BJP Victory
West Bengal Elections
Ganga River
JP Nadda
Amit Shah
Jungle Raj
South India BJP

More Telugu News