Delhi Blast Case: ఎర్రకోట పేలుళ్ల కేసులో పురోగతి.. ఎంబీబీఎస్ విద్యార్థిని పట్టుకున్న ఎన్ఐఏ

MBBS student of Al Falah University arrested in Delhi car explosion case
  • బెంగాల్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
  • మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా పట్టుకున్న అధికారులు
  • నిందితుడు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్‌ యూనివర్సిటీ విద్యార్థి
  • కుటుంబ ఫంక్షన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన నిందితుడు
  • ఇదే యూనివర్సిటీలో పలువురిపై కొనసాగుతున్న ఎన్ఐఏ విచారణ
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఈ వారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. ఈ ఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న నిసార్ ఆలం అనే విద్యార్థిని అరెస్ట్ చేసింది. ప‌శ్చిమ‌ బెంగాల్ పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలోని దల్ఖోలాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం ఉదయం అధికారులు ధ్రువీకరించారు.

నిసార్ ఆలం కుటుంబం పంజాబ్‌లోని లూథియానాలో స్థిరపడింది. అయితే, వారి స్వగ్రామం దల్ఖోలాలోని కోనల్ గ్రామం. ఇటీవల ఓ కుటుంబ ఫంక్షన్ కోసం తల్లి, సోదరితో కలిసి అతడు ఇక్కడికి వచ్చాడు. నిందితుడి మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా అతడి కదలికలను గుర్తించిన ఎన్ఐఏ బృందం, శుక్రవారం దల్ఖోలా చేరుకుని అతడిని అరెస్ట్ చేసింది. అనంతరం స్థానిక ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత సిలిగురికి తరలించింది. అతడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.

ఈ అరెస్ట్‌పై స్థానిక గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిసార్ ఆలం చాలా మంచివాడని, మృదుస్వభావి అని, అతడికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని తాము ఊహించలేదని మీడియాకు తెలిపారు.

ఇదిలా ఉంటే... ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 13 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అల్-ఫలాహ్‌ యూనివర్సిటీపై ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారు. జైష్-ఎ-మొహమ్మద్ టెర్రర్ మాడ్యూల్ నడుపుతున్నారనే అనుమానంతో ఇప్పటికే డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షహీన్ షాహిద్, డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనే ముగ్గురు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా యూనివర్సిటీలో దాదాపు 52 మందిని ప్రశ్నించారు.


Delhi Blast Case
Nisar Alam
Red Fort blast
NIA investigation
Al-Falah University
Jaish-e-Mohammed
terrorism
North Dinajpur
West Bengal police
crime news

More Telugu News