iBomma: 'ఐబొమ్మ'కు పోలీసుల చెక్.. హైదరాబాదుకు వచ్చిన నిర్వాహకుడి అరెస్ట్

iBomma Website Operator Arrested in Hyderabad
  • ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
  • కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు
  • ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగానే పక్కా ప్లాన్‌తో అరెస్ట్
  • నిందితుడి బ్యాంకు ఖాతాలోని రూ.3 కోట్లు ఫ్రీజ్
  • గతంలో పోలీసులకే సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకులు
తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రియులకు సుపరిచితమైన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ కేసులో తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించారు. వెబ్‌సైట్ ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో పోలీసులకే సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇప్పుడు అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే... కరేబియన్ దీవుల నుంచి ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న రవి, శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా ప్రణాళికతో నిఘా పెట్టి అతడిని అరెస్ట్ చేశారు. తెలుగు సినీ నిర్మాతల సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా రవికి చెందిన బ్యాంకు ఖాతాలో ఉన్న సుమారు రూ.3 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది.

గతంలో తమను పట్టుకోవాలని ప్రయత్నిస్తే, యూజర్ల డేటాను లీక్ చేస్తామంటూ ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకే బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ‘దమ్ముంటే పట్టుకోండి’ అంటూ సవాల్ చేయడంతో ఈ కేసును పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. సినిమా పరిశ్రమ నష్టాలకు తాము కారణం కాదని, హీరోల భారీ పారితోషికాలే కారణమని ఐబొమ్మ గతంలో ఓ ప్రకటనలో ఆరోపించింది.

భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న రవి, ఐబొమ్మ ద్వారా ఓటీటీ, పైరసీ కంటెంట్‌ను ఉచితంగా అందిస్తున్నాడు. ప్రస్తుతం వెబ్‌సైట్ సర్వర్లలోని కంటెంట్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ అరెస్ట్‌తో పైరసీ వెబ్‌సైట్ల నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
iBomma
iBomma website
piracy website
Immidi Ravi
Telugu film industry
Hyderabad police
OTT content
movie piracy
cyber crime
Telugu movies

More Telugu News