Balakrishna: ‘అఖండ 2’లో హిందూ సనాతన ధర్మం యొక్క శక్తి, పరాక్రమాన్ని చూస్తారు: బాలకృష్ణ

Balakrishna Comments on Boyapati Srinu Akhanda 2
  • ప్రతి ఒక్కరూ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడాలన్న బాలయ్య 
  • డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల
  • బాలయ్య నిబద్ధతను కొనియాడిన దర్శకుడు బోయపాటి శ్రీను
  • తమ కాంబినేషన్‌లో ఇది నాలుగో విజయవంతమైన చిత్రమన్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాలో హిందూ సనాతన ధర్మం యొక్క శక్తి, పరాక్రమాన్ని చూస్తారని కథానాయకుడు బాలకృష్ణ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను వెంట తీసుకెళ్లి ఈ సినిమాను చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
ఈ సినిమా ప్రచారంలో భాగంగా ముంబైలో చిత్ర బృందం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా "రంగ రంగ శంభు లింగ ఈశ్వర" అంటూ సాగే భక్తి గీతాన్ని విడుదల చేశారు. ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా, శంకర్ మహదేవన్, కైలాశ్ ఖేర్ అద్భుతంగా ఆలపించారు.
 
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. "నాది, బోయపాటిది విజయవంతమైన కలయిక. మేమిద్దరం కలిసి చేసిన గత మూడు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇది మాకు నాలుగో సినిమా" అని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "ఇది కేవలం సినిమా కాదు, భారతదేశ ఆత్మ. మన ధర్మం. అత్యంత శీతల వాతావరణంలో మేమంతా స్వెటర్లు వేసుకుని చిత్రీకరణలో పాల్గొంటే, బాలకృష్ణ గారు మాత్రం ఒక మామూలు పంచె కట్టుతో నటించారు. అది నటన పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. శివయ్యే మా వెనకుండి ఈ సినిమాను పూర్తి చేయించాడు" అని వివరించారు.
 
రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ కార్యక్రమంలో తమన్, ఆది పినిశెట్టి, కైలాశ్ ఖేర్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.
Balakrishna
Akhanda 2
Boyapati Srinu
Akhanda movie
Telugu cinema
Samyuktha Menon
SS Thaman
Hindu Dharma

More Telugu News