Andhra Pradesh Weather: ఏపీకి డబుల్ టెన్షన్.. పెరుగుతున్న చలి.. పొంచి ఉన్న వర్షగండం

Andhra Pradesh Braces for Double Trouble Cold Weather and Rain Forecast
  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
  • ఈ నెల‌ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమలో వర్షాలు
  • రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచన
  • రాష్ట్రంలో రికార్డు స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  • అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
  • కొన్ని జిల్లాల్లో 35 డిగ్రీలు దాటుతున్న పగటి ఉష్ణోగ్రతలు
ఇటీవలి తుఫాను ప్రభావం నుంచి తేరుకుంటున్న ఏపీని మరో అల్పపీడనం భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత కూడా గణనీయంగా పెరిగింది.

విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల‌ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప‌డ‌నుంద‌ని, ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువే అయినప్పటికీ, దీనివల్ల ఈ నెల 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా. ఈ నేప‌థ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.

రికార్డు స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు
మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.మాడుగులలో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, కర్నూలు, ఎన్టీఆర్ వంటి పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 16 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.

పగటిపూట మండుతున్న ఎండలు
విచిత్రంగా కొన్ని జిల్లాల్లో మాత్రం పగటిపూట ఎండలు మండుతున్నాయి. పశ్చిమగోదావరి, ప్రకాశం, చిత్తూరు వంటి ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇలా ఒకేసారి చలి, వేడిగాలులతో పాటు ఇప్పుడు వర్ష సూచన కూడా రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Andhra Pradesh Weather
Andhra Pradesh rains
AP weather forecast
Cyclone alert
Low pressure area
Rayalaseema rains
Coastal Andhra
Cold wave
G Madugula
Weather updates

More Telugu News